ఏటేటా మిర్చి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మిరప పంటకు జిల్లాలోని భూములు అనుకూలంగా ఉండడం.. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలకు తోడు తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలవడం.. రైతుబంధు, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందజేయడం.. రాయితీలు కల్పించడం.. విత్తనాలు, ఎరువులకు లోటు లేకుండా చూడడం వెరసి రైతులు సంబురంగా సాగు పనుల్లో లీనమయ్యారు. ఇక్కడ పండించిన నాణ్యమైన పంట తేజ రకాన్ని వ్యాపారులు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారంటే రైతులు ఏ స్థాయిలో పంట పండిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రైతులు పండించిన పంట ఉత్పత్తులను ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తుండడం.. మద్దతు ధర లభించని పక్షంలో మిర్చిని కోల్డ్ స్టోరేజీలలో రైతులు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. గత ఏడాది ఏసీ రకం మిర్చికి మార్కెట్లో రికార్డు స్థాయిలో క్వింటా ధర రూ.22 వేలు పలికింది. దీంతో జిల్లా రైతులు సాగుపై మక్కువ చూపుతున్నారు.
ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 2 : జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు.. రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లోకి సమృద్ధిగా చేరిన నీటితో రైతులు వరి, పత్తి, మిర్చి సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు కల్పించిన రైతుబంధు, రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ సంబురంగా వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. సాధారణంగా మిర్చి సాగు అనగానే మొదటగా గుర్తుకొచ్చేది ఖమ్మం జిల్లానే. ప్రధాన పంటల సాగుతో మిర్చి పంటను రైతులు పోటీపడి పండిస్తున్నారు. రైతులు ఇక్కడ పండించిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన వ్యాపారులు పొరుగు రాష్ర్టాలతోపాటు చైనా, బంగ్లాదేశ్, బ్యాంకాక్, వియత్నాం తదితర దేశాలకు ఏటా ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తున్నారు.
యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే తేజా రకం మిర్చి పంట ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మాత్రమే సాగవుతుందంటే ఆ పంటకు అంత డిమాండ్ ఉందన్నమాట. పంట సాగుకు ఇక్కడి భూములు అనుకూలంగా ఉండడంతో రైతులు పూర్వం నుంచి ఎక్కువ మొత్తంలో పండిస్తున్నారు. సహజంగా జిల్లాలో మిర్చి పంట సాధారణ సాగు విస్తీర్ణం 50 వేల ఎకరాలు కాగా.. గడిచిన రెండేళ్ల నుంచి అంచెలంచెలుగా సాగు పెరుగుతున్నది. రెండేళ్లుగా మార్కెట్లో మిర్చి ధర గతంలో ఎన్నడూ లేని విధంగా నిలకడగా ఉండడంతో మిర్చి సాగుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. గత ఏడాది మార్కెట్లో ఏసీ రకం మిర్చికి రికార్డు స్థాయిలో క్వింటా ధర రూ.22 వేలు పలికింది. దీంతో అప్పటి నుంచి రైతులు ఎక్కువగా మిర్చి సాగు చేయడానికి మక్కువ చూపుతున్నారు. ఈ ఏడాది వానకాలం సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు మిర్చి సాగు 76 వేల ఎకరాలకు చేరింది. రానున్న రోజుల్లో సాగు విస్తీర్ణం మరికొంత పెరిగే అవకాశం ఉన్నది.
కేవీకే, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల సలహాలు సూచనలు
ఒకవైపు జిల్లాలో అధిక మొత్తంలో మిర్చి పంట సాగు కావడంతో వైరా కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్తలు, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట క్షేత్రాలను సందర్శిస్తున్నారు. పంట సాగులో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు, జాగ్రత్తలపై సలహాలు సూచనలు ఇస్తున్నారు. జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాల్లో సైతం మిర్చి సాగు పెరగడంతో మార్కెటింగ్ శాఖ అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టే పనిలో ఉన్నారు. అంతేకాక జిల్లావ్యాప్తంగా ఉన్న కోల్డ్ స్టోరేజీలలో మిర్చి నిల్వలు తగ్గడం.. ఈ ఏడాది పంట కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతుండడంతో అధిక ధర పలికే అవకాశం ఉన్నట్లు రైతులతోపాటు వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
మండలాలవారీగా సాగు ఇలా…
ఈ ఏడాది వానకాలం సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు 76,017ఎకరాల్లో రైతులు మిర్చి పంట సాగు చేశారు. మండలాలవారీగా పరిశీలిస్తే.. కామేపల్లి మండలంలో 8,389 ఎకరాలు, ఖమ్మం అర్బన్ 89, రఘునాథపాలెం 4,600, ఖమ్మం రూరల్ 3,536, కూసుమంచి 4,143, నేలకొండపల్లి 650, తిరుమలాయపాలెం 9,325, బోనకల్ 3,047, చింతకాని 1,295, మధిర 6,140 , ముదిగొండ మండలంలో 2,761 ఎకరాల్లో పంట సాగవుతున్నది. అలాగే ఎర్రుపాలెం మండలంలో 5,512 ఎకరాలు, సత్తుపల్లి 7, తల్లాడ 6,451, వేంసూరు 145, ఏన్కూరు 7,549, కొణిజర్ల 1,455, సింగరేణి 6,894, కల్లూరు 1,974, పెనుబల్లి 1,295, వైరా మండలంలో 760 ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. అత్యధికంగా తిరుమలాయపాలెం మండలంలో, అత్యల్పంగా సత్తుపల్లి మండలంలో ఎర్ర బంగారం సాగు చేశారు.
చీడపీడల నివారణపై ప్రత్యేక దృష్టి
గతంతో పోల్చితే ఈ ఏడాది జిల్లాలో మిర్చి తోటలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. పంటలను చీడపీడలు ఆశించకుండా వైరా కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పంట సీజన్‌కు ముందే మిర్చి నారు విక్రయించే నర్సరీలను పలుమార్లు సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశాం. కొద్ది రోజులుగా కొన్ని ప్రాంతాల్లో పంటకు బొబ్బ రోగం సోకుతున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయాధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో తోటలను సందర్శించి రైతులకు సలహాలు, సూచనలు చేస్తున్నారు.
-జీ.అనసూయ, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి
జిల్లాలో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం : 50,500 ఎకరాలు
గత ఏడాది సాగు విస్తీర్ణం : 61,350 ఎకరాలు
ఈ ఏడాది సాగు విస్తీర్ణం : 76,017 ఎకరాలు (ఇప్పటి వరకు)
పంట దిగుబడి అంచనా : 1,25 375 మెట్రిక్ టన్నులు
ఎకరానికి సరాసరి దిగుబడి : 1.50 మెట్రిక్ టన్నులు