ఖమ్మం వ్యవసాయం, జనవరి 30 : బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గంటగంటకూ జెట్ స్పీడ్తో పెరుగుతుంటే.. ఖమ్మం మార్కెట్లో మాత్రం ఎర్రబంగారం(తేజా మిర్చి) ధర రోజురోజుకూ పతనమవుతున్నది. పంట చేతికి వచ్చే సీజన్ కావడంతో గడిచిన వారంరోజుల నుంచి రికార్డు స్థాయిలో రైతులు మార్కెట్కు పంటను తీసుకొస్తున్నారు. జిల్లా రైతాంగంతోపాటు పొరుగున ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నుంచి సైతం రైతులు పంటను తెస్తున్నారు. గత ఏడాది మార్కెట్లో మిర్చికి రికార్డు స్థాయి ధర పలకడంతో రైతులు ఈ ఏడాది భారీగా సాగు చేశారు.
తీరా పంట చేతికి వచ్చేసరికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావమో, ఖమ్మం ఏఎంసీ మార్కెట్ మాయాజాలమో తెలియదు కానీ పదిరోజుల నుంచి వరుసగా ధర తగ్గుకుంటూ వస్తున్నది. గత ఏడాది తాలు రకం పంటకు ఇదే మార్కెట్లో క్వింటాల్ రూ.14 వేల వరకు పలికింది. కానీ ఈ ఏడాది సీన్ రివర్సు అయ్యి ప్రస్తుతం ఇదే మార్కెట్లో జెండాపాటలో నాణ్యమైన పంటకు గరిష్ఠ ధర క్వింటాల్ రూ.14 వేలకు చేరి రైతులను మరింత ఆందోళనకు గురిచేసింది.
గురువారం ఉదయం జెండాపాట సమయానికి రైతులు రికార్డుస్థాయిలో 50 వేల బస్తాలను యార్డుకు తీసుకరావడంతో మిర్చియార్డు ఎర్రబంగారంతో కళకళలాడింది. కొద్దిసేపటికే జెండాపాట తరువాత ఎర్రబంగారం సాగు చేసిన రైతుల ముఖాలు వాడిపోయాయి. మిర్చిపంట అంటేనే పెట్టుబడులు అధికంగా ఉంటుంది. మిర్చినారుకు గాని, సొంతంగా మిర్చి సీడ్ తీసుకున్న రైతులకు ఇతర విత్తనాల కంటే అధిక ధర చెల్లిస్తుంటారు. ఇకపోతే రెండు, మూడు రోజులకు ఒకసారి పురుగు మందులు పిచికారీ చేస్తే కానీ పంట చేతికి వచ్చే అవకాశం ఉండదు. ఇలా కంట్లో ఒత్తులు పెట్టుకొని పంటను సాగు చేసిన రైతులు మార్కెట్లో పలుకుతున్న ధరను చూసి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఈ సంవత్సరం మిర్చి సాగు చేసిన రైతులకు పంట మంచి దిగుబడి వస్తున్నది. చీడపీడల బెడద, వైరస్ ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఆరంభంలోనే మార్కెట్కు నిత్యం 40 నుంచి 50 వేల బస్తాలు తీసుకొస్తున్నారు. అయితే కనిష్ఠ స్థాయికి ధరలు పడిపోతుండడంతో అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. ఎగుమతిదారులు మిలాఖత్ కావడంతోనే ధరలు పడిపోతున్నాయని స్థానిక మిర్చి ఖరీదుదారులు పేర్కొంటున్నారు. అయితే ఇలాంటి ప్రత్యామ్నాయ పరిస్థితిలో మార్కెట్ పాలకవర్గం క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
మార్కెట్లో మిర్చి ధరలు పడిపోయిన ప్రతిసారి రైతుబంధు పథకం ద్వారా గత పాలకవర్గాలు రైతులకు వడ్డీలేని రుణాలు ఇచ్చి ఆదుకున్నారు. ప్రస్తుత పరిస్థితిలో రైతులు పంటను కోల్డ్ స్టోరేజీలలో నిల్వ పెట్టుకోవాలంటే మార్కెట్ ఆదాయ నిధుల నుంచి వడ్డీలేని రుణాలు ఇస్తామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ధర పెరిగిన తరువాత తిరిగి అమ్ముకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. దీనికితోడు ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, సీరోలు మండలాల పరిధిలో ఉన్న చైనా మిర్చి నుంచి నూనె తీసే చైనా కంపెనీలు పక్షంరోజుల ముందుగా ప్రారంభమయ్యే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటే మార్కెట్లో పోటీతత్వం పెరిగి ధర పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మిర్చి ధర మరింత పడిపోకముందే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది వేచిచూడాలి.
పోయిన ఏడాది తాలు పంటకు పలికిన ధర కూడా ఈ సంవత్సరం నాణ్యమైన పంటకు పలకడం లేదు. ఈ ఏడాది దాదాపు రెండు ఎకరాల్లో మిర్చిసాగు చేశాను. పంట దిగుబడి సైతం తగ్గింది. కనీసం క్వింటాల్ రూ.20 వేలు పలికితేనే పెట్టుబడులు పూడే అవకాశం ఉంటుంది. కానీ మార్కెట్లో రోజురోజుకూ మిర్చి తగ్గుతుండడం చాలా బాధగా ఉంది. పేరుకు జెండాపాట కానీ ఆ ధర ఒక్కరిద్దరి రైతులకు మాత్రమే వ్యాపారులు పెడుతున్నారు. ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోవాలి.
– పరిమి శ్రీనివాసరావు, రైతు, బాణాపురం, ముదిగొండ
భూమి కౌలుకు తీసుకొని మరీ మిర్చి పంట సాగు చేసి, ఇప్పుడు అప్పులపాలు అయ్యాను. ఒక్కో ఎకరానికి రూ.25 వేలు కౌలు, పెట్టుబడి రూ.50 వేలు అయ్యింది. దీంతో ఎకరానికి రూ.75 వేలు రావాలి. కానీ మార్కెట్లో అలాంటి పరిస్థితి లేదు. ఈ రోజు నేను మార్కెట్కు తీసుకొచ్చిన నెంబర్వన్ మిర్చి క్వింటాల్ రూ.13,500 మాత్రమే పలికింది. కానీ కాంటా వేసేటప్పుడు మరోసారి చూస్తాం.. తేడా వస్తే ధర తగ్గుతుందని చెబుతున్నారు. యార్డులో ఏ రైతుకూ కూడా పంట నాణ్యతను బట్టి వ్యాపారులు మంచి ధర పెట్టడం లేదు.
– రాపెల్లి కొండల్, రైతు, గువ్వలగూడెం, నేలకొండపల్లి