అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను సైతం ఆకర్షించేందుకు యూనిఫాం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మొదటి విడతలో భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 626 అంగన్వాడీ కేంద్రాల్లో 7,431 మంది చిన్నారులను ఎంపిక చేసింది. వీరిలో బాలురు 3,776 మంది, బాలికలు 3,655 మంది ఉన్నారు. మలి విడతలో అన్ని అంగన్వాడీ కేంద్రాల చిన్నారులకూ యూనిఫాం అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ.. ఈ ఏడాది అందించాల్సిన మొదటి విడత పంపిణీలోనే ఇంత అలసత్వం ఉంటే మిగతా చిన్నారులకు ఇంకెన్నేళ్లు పడుతుందోననే అనుమానం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల తరహాలో అంగన్వాడీ కేంద్రాలకు కూడా యూనిఫాం అందించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. చిన్నారులకు దానిని పంపిణీ చేయడంలో తీవ్రంగా అలక్ష్యం వహిస్తోంది. అప్పుడు హామీ ఇచ్చినప్పటికీ.. ఇప్పుడు కనీసం దాని ఊసెత్తడం లేదు. జిల్లాలో యూనిఫాం కుట్టడం పూర్తయి అంగన్వాడీ కేంద్రాలకు కూడా చేరినట్లు సమాచారం. వీటిల్లో బాలురకు చొక్కా, నెక్కరు, బాలికలకు గౌను ఉన్నాయి. వీటిని స్వయం సహాయక సంఘాల మహిళలు కుడుతున్నారు. ఒక్కో జత యూనిఫాం కుట్టడానికి ప్రభుత్వం బాలురకు రూ.80, బాలికలకు రూ.60 చొప్పున చెల్లిస్తోంది. అయితే, యూనిఫాం కుట్టడం పూర్తయినప్పటికీ దానిని ఎక్కడ ఉంచారన్న కనీస సమాచారాన్ని మాత్రం ప్రభుత్వం బయటకు తెలియనీయడం లేదు. విద్యా సంవత్సరం సగం పూర్తయిందని, ఇంకా యూనిఫాం ఎప్పుడు పంపిణీ చేస్తారని చిన్నారుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు యూనిఫాం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో కో లోకేటెడ్ అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు అందించేందుకు నిర్ణయించింది. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా మొత్తం 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. వీటిలో 626 అంగన్వాడీ కేంద్రాలు కో లోకేటెడ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో మొత్తం 7,431 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. వీరిలో 3,776 మంది బాలురు, 3,655 మంది బాలికలు ఉన్నారు. అంగన్వాడీలకు వెళ్లే తమ చిన్నారులను యూనిఫాంలో చూసుకోవాలని తల్లిదండ్రులు మురిసిపోతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆ భాగ్యం కల్పించడం లేదు.
యూనిఫాం వివరాలు తెలుసుకుంటాం..
అంగన్వాడీల చిన్నారులకు యూనిఫాం పంపిణీ వివరాలు తెలుసుకుంటాం. నేను ఇటీవలే బాధ్యతలు తీసుకున్నాను. ఆ తర్వాత యూనిఫాం గురించి సమాచారం లేదు. జిల్లా ఉన్నతాధికారులను సమన్వయం చేసుకుని చిన్నారులకు యూనిఫాం అందించేలా చర్యలు తీసుకుంటాం.
-ముత్తమ్మ, ఇన్చార్జి సీడీపీవో, అశ్వారావుపేట
గత కేసీఆర్ సర్కారులో మహర్దశ..
గత కేసీఆర్ ప్రభుత్వంలో అంగన్వాడీలు మహర్దశతో వెలుగొందాయి. ప్రత్యేక నిధులు కేటాయించి.. వాటి అభివృద్ధికి గత కేసీఆర్ ప్రభుత్వం తోడ్పాటునిచ్చింది. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సకల సౌకర్యాలు కల్పించింది. నాణ్యమైన విద్యను అందించింది. మరింత బలోపేతం చేసే దిశగా అనేక చర్యలు చేపట్టింది. కానీ.. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు మాత్రం.. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, ఇందుకు యూనిఫామే ప్రత్యక్ష ఉదాహరణ అని తల్లిదండ్రులు చెబుతున్నారు.