కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఫిబ్రవరి 28: ఇంటర్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారి అన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్పై కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఐడీవోసీ నుంచి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ వీసీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మార్చి 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిబ్బంది నియామకం, శిక్షణ పూర్తి కావడంతోపాటు ప్రశ్నపత్రాలు జిల్లాలకు చేరుకున్నాయన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 36 కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొదటి సంవత్సరంలో 9,255 మంది, ద్వితీయ సంవత్సరంలో 10,003 మంది పరీక్ష రాయనున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది రామచంద్ర డిగ్రీ కాలేజీలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. 36 మంది చీఫ్ సూపరింటెండెంట్లతోపాటు 13 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, 36 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 13 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లను నియమించామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ విద్యాచందన, ఆర్డీవోలు మధు, దామోదర్‌రావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు, డీపీవో చంద్రమౌళి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మహేందర్, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.