అశ్వారావుపేట టౌన్, మే 30: తెలంగాణ సాధించిన నాటి నుంచి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న మహా నాయకుడు కేసీఆర్ అని గౌడ సంఘం నాయకుడు ఆరేపల్లి సాంబశివరావు పేర్కొన్నారు. అలాంటి కేసీఆర్ కుల వృత్తుల కుటుంబాలకు జీవం పోస్తున్నారని, వెనుకబడిన కులవృత్తుల ఆర్థిక పురోగతి కోసం కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం ప్రకటించారని అన్నారు. కులవృత్తులకు సాయం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గౌడ సంఘం, గీత కార్మికుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని గౌడబజార్లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా సంఘం నాయకుడు సాంబశివరావు మాట్లాడుతూ.. పింఛన్ సౌకర్యం, బీమా సౌకర్యం వంటివన్నీ కన్పిస్తున్న సీఎం కేసీఆర్కు గీత కార్మికులు రుణపడి ఉంటారని అన్నారు. సంఘం నాయకులు వేముల ప్రతాప్, ఆరేపల్లి రాములు, బుర్ర వెంకన్న, పల్లెల సుబ్బారావు, వెంకటేశ్వరావు, కోటి, శ్రీను, వెంకటేశ్వరావు, లక్ష్మణరావు, సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకుడు మోటూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.