చర్ల, నవంబర్ 21: తమ పోడు భూములను తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చర్ల మండలం తిమ్మిరిగూడెం, జంగాలపల్లి గ్రామాల ఆదివాసీలు కలివేరు క్రాస్‌రోడ్డు వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీలు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి పోడు సాగు చేసుకుంటున్నామని, అటవీ శాఖ అధికారులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరించామని, అయినా మాపై కనికరం చూపడం లేదని అన్నారు.
పోడు భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు రిజర్వు ఫారెస్టు భూముల్లో కందకాలు సైతం తవ్వించారని, తమకు మద్దతుగా ఆనాడు ఎమ్మెల్యే మాట్లాడినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతింపజేశారు. చట్టప్రకారం పోరాటాలు చేయాలి తప్ప ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించొద్దని నచ్చజెప్పారు. ఈ క్రమంలోనే అంబులెన్స్ రావడంతో వాహనానికి దారి ఇవ్వడంతో అందరూ పక్కకు తొలగడంతో ఆందోళన సద్దుమణిగింది.