ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో రోజు బుధవారం నాటి గ్రామసభల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కొన్ని గ్రామాల్లోని అర్హుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో నిరుపేదలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడక్కడా అధికార పార్టీ నేతలు జులుం ప్రదర్శించడం, అధికారులు కూడా దురుసుగా ప్రవర్తించడం, అనర్హులకే జాబితాలో అందలం వేయడం, అర్హులను ఏకపక్షంగా తగ్గించడం వంటి కారణాలతో అత్యధిక పల్లెల్లోని గ్రామసభలు ఉద్రిక్తంగా, రణరంగంగా మారాయి.
చివరికి పోలీసుల బందోబస్తు మధ్య సభలు నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పేదలకు పథకాలు వర్తింపజేయట్లేదంటూ ప్రశ్నలు కొనసాగాయి. అనర్హులను ఎంపిక చేయడం పట్ల అర్హులు మండిపడ్డారు. అధికారులపైనా, అధికార పార్టీపైనా ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. తాము నిరుపేదలమైనప్పటికీ ఇందిరమ్మ ఇళ్లకు తమను ఎందుకు ఎంపిక చేయలేదంటూ అర్హులు నిలదీశారు. దీంతో కారేపల్లి మండలం కోమట్లగూడెంలో ఓ నిరుపేద అధికార పార్టీ నేత చెంపను చెళ్లుమనిపించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ కాంగ్రెస్ నాయకుడు.. అధికారుల సమక్షంలోనే సదరు నిరుపేదపైతిరిగి దాడి చేశాడు.
గతంలో తన ఇందిరమ్మ ఇంటి బిల్లులను దళారీ కాజేసినందున తాజాగా తనకు కూడా ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ చింతకాని మండలానికి చెందిన ఓ పారిశుధ్య కార్మికుడు మరోసారి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. కొణిజర్లలో అధికారుల దురుసు సమాధానాలకు ఆగ్రహించిన గ్రామస్తులు.. గ్రామసభ టెంటును కూల్చి నిరసన తెలిపారు. పథకాల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ఆవేదనకు గురైన అన్నపురెడ్డిపల్లి మండల మహిళలు.. సభలో నేలపై కూర్చొని ఆందోళనకు దిగారు.
– ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, జవవరి 22
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో రెండో రోజు బుధవారం జరిగిన గ్రామసభలు కూడా గందరగోళంగా మారాయి. నేలకొండపల్లి మండల గ్రామసభకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెండు జిల్లాల్లోని పలు గ్రామసభలకు ఆయా కలెక్టర్లు ముజమ్మిల్ ఖాన్, జితేశ్ వి పాటిల్ హాజరయ్యారు. మొదటి రోజు మంగళవారం నాటి నిరసనల దృష్ట్యా ప్రభుత్వం అన్ని గ్రామసభలనూ పోలీసుల బందోబస్తు మధ్య ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ప్రజల నిలదీతలు ఆగలేదు. కల్లూరు మండలం కోరట్లగూడెం గ్రామసభలో ఆర్డీవో రాజేందర్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు. అయితే చాలా గ్రామాల్లో అర్హుల జాబితాలో అనర్హుల (భూస్వాములు, ఉద్యోగులు) పేర్లు రావడం, ఇదేంటని అర్హులు ప్రశ్నించడం వంటి కారణాలతో ఆయా గ్రామాల్లో ప్రజల మధ్య ఈ గ్రామసభలు, పథకాలు చిచ్చుపెడుతున్నట్లవుతోంది. ఒక్కోసారి అర్హులు, అనర్హుల మధ్య కూడా ఘర్షణ జరుగుతుండడంతో గ్రామస్తులు రెండు వర్గాలుగా ఏర్పడుతున్నారు.
ఈమెది లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్. ఈమె పేరు అల్లి కల్యాణి. ఈమె భర్త క్యాన్సర్‌తో మంచాన పడ్డాడు. కూలి పని చేస్తే తప్ప పూటగడవదు. నిలువనీడ లేదు. దీంతో ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంది. కానీ.. బుధవారం నాటి గ్రామసభలోని లబ్ధిదారుల జాబితాలో ఆమె పేరు రాలేదు. దీంతో ఆగ్రహానికి, ఆవేదనకు గురైన ఆమె.. సభా వేదికపైన ఉన్న అధికారుల వద్దకు వెళ్లింది. ‘నేను పేదరాలిని కాదా సారూ..’ అంటూ ప్రశ్నించింది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో నా పేరు ఎందుకు రాలేదంటూ నిలదీసింది. దీంతో అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. మళ్లీ ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే మరోసారి వస్తుందంటూ సర్దిచెప్పారు.
కొణిజర్ల మండలం గుండ్రాతిమడుగు (సిద్దిక్‌నగర్)లో బుధవారం జరిగిన గ్రామసభ.. టెంటు కూల్చేవరకూ వెళ్లింది. గుండ్రాతిమడుగు పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభలో అధికారులు.. లబ్ధిదారుల జాబితా చదవడాన్ని మొదలుపెట్టారు. కొద్దిసేపట్లోనే గ్రామస్తులు, అర్హులు ఆందోళనకు దిగారు. జాబితాలో చదువుతున్న పేర్లన్నీ అనర్హులవేనని, ఇప్పటి వరకూ చదివిన పేర్లలో అర్హుల పేర్లు పెద్దగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన అర్హుల జాబితాను తయారుచేశారంటూ నిలదీశారు. దీంతో సమాధానం చెప్పే విషయంలో అర్హులతో అధికారులు దురుసుగా వ్యవహరించారు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు, అర్హులు.. గ్రామసభ టెంట్లను కూల్చివేశారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. అలాగే, ఇదే మండలంలోని లక్ష్మీపురం, మల్లుపల్లి, గోపవరం, అంజనాపురం, అమ్మపాలెం గ్రామాల గ్రామసభల్లోనూ ఇలాంటి అలజడి వాతావరణమే నెలకొన్నది.
కారేపల్లి మండలం కోమట్లగూడెం గ్రామసభలో ఓ నిరుపేద ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను నిరుపేదనైనప్పటికీ అర్హుల జాబితాలో తన పేరును ఎలా లేకుండా చేశారంటూ అధికారులను ప్రశ్నించాడు. అధికార పార్టీ నాయకులు తమ అనుయాయుల పేర్లనే పథకాల అర్హుల జాబితో చేర్చారని, మాలాంటి అర్హుల పేర్లను తొలగించారని ఆరోపించారు. దీంతో సభావేదికపై కూర్చున్న అధికార పార్టీ నేత ఒకరు.. ఆ నిరుపేదపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరూ మాటామాటా అనుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో సదరు నిరుపేద ఒక్కసారిగా ఆ కాంగ్రెస్ నాయకుడి చెంపను చెళ్లుమనిపించాడు. దీంతో రెచ్చిపోయిన అధికార పార్టీ నేత.. అధికారుల సమక్షంలోనే ఆ నిరుపేదలపై తిరిగి దాడి చేశాడు.
అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామసభలోని అధికారులను మహిళలు చుట్టుముట్టారు. ‘మేము అర్హులం కాదా?’ అంటూ ప్రశ్నించారు. ‘మరి అనర్హులను ఎలా ఎంపిక చేశారు?’ అంటూ నిలదీశారు. ఇప్పటికే ఇళ్లు ఉన్న వాళ్లకే మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తారా?’ అంటూ కడిగిపారేశారు. ఎవరు అర్హులో, ఎవరు అనర్హులో అనే విషయాన్ని సర్వే సమయంలోనే ఎందుకు గుర్తించలేకపోయారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో పోలీసులు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా మహిళలు ఖాతరు చేయలేదు. పథకాల్లో తమ పేర్లు లేకుండా తమకు అన్యాయం చేశారని, దాని గురించే తాము ప్రశ్నిస్తున్నామని అన్నారు. దీంతో మహిళలు.. అధికారులను నిలదీస్తున్న వీడియోలను పోలీసులు తమ సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ పరోక్ష బెదిరింపులకు యత్నించారు. అయినా మహిళలు వెనుకడుగు వేయకుండా తమలాంటి అర్హులకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించారు.
ప్రభుత్వ పథకాలను అసలైన అర్హులను ఎంపిక చేయలేదని ఆరోపిస్తూ అధికార పార్టీ కాంగ్రెస్ సహా మిగతా పార్టీల నాయకులు కూడా ఆందోళన చేపట్టిన ఘటన నేలకొండపల్లి మండలంలో బుధవారం రెండోరోజు గ్రామసభలో చోటుచేసుకుంది. బోదులబండ గ్రామంలో గ్రామసభ మొదలైన వెంటనే అధికారులు.. అర్హుల జాబితాను చదువుతుండగా గ్రామస్తులు, పలు పార్టీల నాయకులు అభ్యంతరం చెప్పారు. అర్హుల పేర్లు జాబితాలో లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గ్రామసభలో ఎంపిక విధానాన్ని నిలిపివేయాలని, గ్రామంలో మళ్లీ తిరిగి సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఇన్ని పథకాలకు అనర్హులను, ఉద్యోగులను, భూములున్న వాళ్లను ఎలా ఎంపిక చేస్తారంటూ ప్రశ్నించారు. భవనాలు, పొలాలు, ఆస్తులు ఉన్న వాళ్లనే మళ్లీ ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేశారంటూ గ్రామస్తులు, మహిళలు ఆందోళనకు దిగారు.
తాజా గ్రామసభల్లో తనకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని, గత కాంగ్రెస్ పాలనలో తనకు అన్యాయం జరిగినందున ఇప్పుడు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో పారిశుధ్య కార్మికుడు పామర్తి శ్రీను సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తన భార్య లక్ష్మీతిరుపతమ్మ పేరిట ఓ దళారి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయించుకొని బిల్లులు స్వాహా చేశాడని ఆరోపించాడు. అందుకని తాజా గ్రామసభల్లో తనకు ఇందిరమ్మ ఇల్లు రావడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, కలెక్టర్‌కు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం సెల్ టవర్ ఎక్కిన శ్రీను.. ఇందిరమ్మ ఇల్లు రాకపోతే తనకు చావే శరణ్యమంటూ స్వయంగా తన సెల్ఫోన్లో వీడియో రికార్డు చేసుకొని గ్రామ సోషల్ మీడియాలో పెట్టాడు. గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని అతడితో ఫోన్లో మాట్లాడి హామీ ఇచ్చి కిందికి దింపారు.
కటిక పేదోళ్లమైనా మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు. దశాబ్దాలుగా అద్దె ఇళ్లలో ఉంటున్నాం. ఇంకా ఎంతకాలం ఉండాలి? పంచాయతీలో చెత్త ఎత్తే పనిచేస్తున్నాం. మాలాంటి పేదలకు అందని పథకాలు ఎందుకు? మళ్లీ ఉన్నోళ్లకే ఇచ్చి మా పొట్టలు కొడతారా?
– జి.లింగమ్మ, మేషన్ కాలనీ, చుంచుపల్లి
గూడు ఉంటే ఏదో ఒక పనిచేసుకొని బతకొచ్చు. అదే లేకపోతే కూలి పనులు చేసిన డబ్బులన్నీ ఇంటి అద్దెకే సరిపోతాయి. ఇన్ని కష్టాలూ ఇంటి కోసమే కదా? మాలాంటి కూలీలకు ఇల్లు రాకపోతే ఎలా? ఉన్న వాళ్లకే మళ్లీ ఇస్తే మాకు అన్యాయం చేసినట్లే కదా?
-బానోత్ బాలకృష్ణ, ప్రశాంతినగర్, చుంచుపల్లి