ఖమ్మం రూరల్, జూన్ 30 : భారత దేశ ప్రయోజనాలను, ప్రతిష్టను అమెరికాకు తాకట్టు పెడుతున్న ప్రధాని నరేంద్రమోదీ విధానాలపై ఉద్యమించాలని ఏఐవైఎఫ్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణ యువతకు పిలుపునిచ్చారు. సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డులో గల డిబిఆర్ సర్కిర్‌లో భారతీయుల పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఫ్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. తొలుత సిపిఐ పార్టీ కార్యాలయంలో జులై 2న హైదరాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ముట్టడి గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. నరేంద్రమోదీ విధానాలు దేశానికి ప్రమాదకరమని, దేశాన్ని తిరోగమన దిశలో తీసుకెళ్లే విధానాలను అనుసరిస్తున్నట్లు ఆరోపించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు వత్తాసు పలుకుతూ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రతిష్టను దిగజార్చే చర్యలకు పూనుకుంటున్నట్లు దుయ్యబట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని చెప్పడం చూస్తే, మన దేశ ప్రతిష్టను మోదీ తాకట్టు పెట్టాడనడానికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు. భారత పౌరులపై అమెరికా దుర్మార్గంగా వ్యవహరించడాన్ని అభ్యంతరం చెప్పడంలో విఫలమవడం, మోదీ ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గు చేటన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రయోజనాలను కాపాడతామని గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి, ఇటువంటి కఠినమైన బహిష్కరణ చర్యల నేపథ్యంలో తన సొంత ప్రజలకు కనీస గౌరవాన్ని అందించడంలో విఫలమైందన్నారు.
”హౌడీ మోడీ”, ”నమస్తే ట్రంప్” వంటి ప్రజా దుర్వినియోగ కార్యక్రమాలు చేపడుతున్నారే తప్ప, భారత దేశంలో యువతకు అవసరమైన నిర్దిష్ట ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని ధ్వజమెత్తారు. ట్రంప్ ను ప్రపంచ అధ్యక్షుడుగా చేసేందుకే మోదీ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ, ట్రంప్ వల్ల ఆయా దేశాలకు ఒరిగిందేమి లేదన్నారు. అమెరికా రాయబార కార్యాలయ ముట్టడికి జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున యువజన సంఘ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు ఉసికల రవి, జిల్లా సహాయ కార్యదర్శి మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి, జిల్లా కోశాధికారి కొల్లి రవి, 28వ డివిజన్ అధ్యక్షుడు రెబగొండ్ల గోపి, కార్యదర్శి అక్కినపల్లి దేవయ్య, 29వ డివిజన్ అధ్యక్షుడు సన్నీ, కార్యదర్శి మిరియాల నరున్ తేజ్, 30వ డివిజన్ కార్యదర్శి బంక అశోక్, యువజన సంఘం సభ్యులు మామిడాల కిరణ్, గుడిమెట్ల శ్రీకాంత్, సీపీఐ నాయకులు మేళ్లచెరువు గురవయ్య, లగిశెట్టి రమేశ్, బుర్ల రాము పాల్గొన్నారు.