ఖమ్మం వ్యవసాయం, జనవరి 19 : సొసైటీ చైర్మన్ల సహకారం, బ్యాంకు ఉద్యోగుల కృషి ఫలితంగా అనతి కాలంలోనే నష్టాలను అధిగమించి ఖమ్మం డీసీసీబీని రూ.10 కోట్ల లాభాలకు తీసుకొచ్చామని చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. శుక్రవారం డీసీసీబీ సీఈవో అబ్దుల్ ఉర్ రెహమాన్‌తో కలిసి డీసీసీబీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2020 సంవత్సరంలో ఖమ్మం డీసీసీబీ టర్నోవర్ రూ.2,375 కోట్లు కాగా.. ప్రస్తుతం రూ.2,948 కోట్లకు చేర్చామన్నారు. గతంలో బ్యాంకు మూలధనం రూ.116 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ.144 కోట్లకు చేరిందన్నారు. 2020లో రూ.994 కోట్లు కాగా.. ప్రస్తుతం రూ.1,109 కోట్ల డిపాజిట్లు ఉన్నాయన్నారు. నాలుగేండ్లలో రూ.115 కోట్ల డిపాజిట్లు అధికంగా సేకరించామన్నారు. నాలుగేండ్ల క్రితం తమ పాలకవర్గం బాధ్యతలు చేపట్టే నాటికి బ్యాంకు రూ.7.23 కోట్ల నష్టాల్లో ఉండగా..
దానిని లాభాల్లోకి తీసుకొచ్చి అద్భుత ప్రగతి సాధించామన్నారు. గతంలో మొండి బకాయిలు రూ.102.39 కోట్లు కాగా.. ప్రస్తుతం రూ.33.64 కోట్లు ఉన్నాయన్నారు. బ్యాంకు పురోభివృద్ధితోపాటు సహకార సంఘాల బలోపేతానికి ప్రత్యేక కృషి చేశామన్నారు. తమ సొంత సొసైటీ వీ వెంకటాయపాలెంను అనేక విభాగాల్లో ప్రగతి పథంలో నడిపించామని గుర్తు చేశారు. గతంలో అన్ని రకాల వ్యాపారాలు కలిసి సొసైటీ టర్నోవర్ రూ.15.89 కోట్లు కాగా.. ప్రస్తుతం తమ సొసైటీ టర్నోవర్ రూ.20.88 కోట్లకు చేరిందన్నారు. ప్రభుత్వం మారడం వల్లే తమపై అవిశ్వాసం పెట్టారని, తాను ఎక్కడ కూడా అవినీతికి చోటు లేకుండా పని చేశానన్నారు. బ్యాంకు, సొసైటీల బలోపేతానికి తనకు సహకరించిన పాలకవర్గ సభ్యులు, సొసైటీ చైర్మన్లు, సీఈవోలు, బ్యాంకు అధికారులు, ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పంట రుణాల రికవరీపై మరింత దృష్టి సారించామని డీసీసీబీ సీఈవో అబ్దుల్ ఉర్ రెహమాన్ తెలిపారు. రుణాలు తీసుకున్న రైతులు బ్యాంకు పురోభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సకాలంలో తిరిగి చెల్లించాలన్నారు. అలాగే మొండి బకాయిలు వసూలు చేయాలని బ్యాంకు మేనేజర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. మార్చి నాటికి వందకు వంద శాతం రుణాల రికవరీ జరిగే విధంగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు.