సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : పట్టణాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో ఉండే మహిళల మెడలో నుంచి స్నాచర్లు బంగారు గొలుసులు లాక్కెళ్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా వరకు గ్రామీణ ప్రాంతాలున్నాయి. ఇండ్లకు, పొలాలకు మధ్య దూరం ఉండడంతో మహిళలు నడుచుకుంటూ వెళ్తుంటారు. పొలాల వద్ద ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉంటారు. దుండగులు ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ అదును చూసి ఒంటరి మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులను ఎత్తుకెళ్తున్నారు.
గురువారం ప్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ షాద్నగర్ పరిధిలో పొలంలో కూర్చొని ఉన్న వీరమ్మ అనే మహిళ మెడలో నుంచి మధ్యాహ్నం సమయంలో బైక్పై వచ్చిన దుండగులు నాలుగు తులాల బంగారు పుస్తెల తాడు లాక్కొని పరారయ్యారు. ఏడాది క్రితం కేశంపేట్ పోలీస్స్టేషన్ పరిధిలో పొలం నుంచి ఇంటికి వెళ్తున్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి స్నాచర్లు బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నగరంతోపాటు సిటీ బయట వివిధ రాష్ర్టాలకు చెందిన వారు జీవనోపాధి కోసం వచ్చి ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. పరిశ్రమలతోపాటు వ్యవసాయ పనుల్లోనూ ఆయా రాష్ర్టాలకు చెందిన వారు పాల్గొంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటూ అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ల ముఠాలు మహిళలను టార్గెట్ చేస్తున్నారు.
ఒక్కో పోలీస్స్టేషన్ పరిధిలో ఒకటి రెండు పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోల్ట్స్ వాహనాలు మాత్రమే ఉంటాయి. ఉదయం, సాయంత్రం పెట్రోలింగ్ వాహనాలు రౌండ్ కొట్టాయంటూ అదే ఎక్కువ అయిపోయిందనే భావనలో ఉంటారు. అయితే విజిబుల్ పోలీసింగ్తోనే స్నాచర్ల ఆట కట్టించవచ్చని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే గ్రామానికో పోలీసు అధికారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనుమానితులు ఎవరైనా ఉంటే వెంటనే సమాచారం అందించాలని, దీనిపై అందరిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్థానికులు చెబుతున్నారు.