నల్లగొండ : రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయడానికి పూనుకుంది. ఈ పథకాలను కొనసాగించాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పతకాలు కొనసాగించాలని..డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో జరిగిన అక్రమాల పై విచారణ జరిపి అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టర్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో పాల్గొని ప్రవీణ్ కుమార్ మాట్లాడారు.
ఈ పథకాలపై కోర్టులో కేసు ఉందనే విషయం తెలియదా? కావాలనే సరైన వాదనలు వినిపించకుండా కోర్టులో వ్యతిరేక తీర్పు వచ్చే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసిందని విమర్శించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అని తెలిసినప్పటికీ పథకాలను నీరుగార్చటానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
నల్లగొండలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు డబ్బులు తీసుకొని అనర్హులకు ఇండ్లు కేటాయించారని వీటిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించడానికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. జెసీ మెమోరాండం స్వీకరించడానికి రాగా బీఆర్ఎస్ నాయకులు ఇవ్వడానికి నిరాకరించారు. ఎట్టకేలకు గ్రీవెన్స్‌లో కలెక్టర్ వద్దకు అనుమతి ఇవ్వడంతో కలెక్టర్‌కు మెమోరాండం అందజేశారు.