ముంబై: మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత వింత వాదన వినిపించారు. రహదారి పనుల జాప్యంతో పాటు ఆ రాష్ట్రంలో మద్యం వినియోగం పెరుగడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కారణమని ఆరోపించారు. (Sujay Vikhe Patil) మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ కుమారుడు, అహ్మద్‌నగర్ మాజీ ఎంపీ అయిన సుజయ్ విఖే పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అహ్లియానగర్-మన్మాడ్ రోడ్డు ప్రాజెక్ట్ ఆలస్యానికి ట్రంప్ కారణమని ఆరోపించారు. ఇరాన్‌పై దాడికి పాల్పడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెడ్డ రాజకీయ విధానాల వల్ల ఈ ప్రాజెక్టుకు అవసరమైన ముడిసరుకుల కొరత ఎదురైందని ఆయన అన్నారు.
కాగా, అమెరికా-ఇరాన్ యుద్ధం వల్ల తారు అందుబాటులో లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్, ఢిల్లీ నుంచి వాహనాల ద్వారా రవాణా చేయాల్సి వస్తోందని సుజయ్ విఖే పాటిల్ తెలిపారు. దీనివల్ల ఖర్చు రెండున్నర రెట్లు పెరుగడంతో పాటు, ఆ పెరిగిన ఖర్చులకు కూడా అనుమతులు అవసరమైనట్లు వివరించారు. ‘ఇవన్నీ సాంకేతిక సమస్యలు. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులే నేను కూడా ఎదుర్కొంటున్నా’ అని అన్నారు. అలాగే ట్రంప్ చర్యల వల్ల కలిగిన గందరగోళం కారణంగా కొంతమందిలో మద్యం వినియోగం కూడా బాగా పెరిగిందని ఆయన ఆరోపించారు.