NTA : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీరుపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు (Congress Top Leader), లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఆగ్రహం వ్యక్తంచేశారు. యూజీసీ-నెట్ పరీక్ష (UGC Net Exam) లో సోషియాలజీ, ఇంగ్లిష్, కామర్స్ పరీక్షలను రద్దుచేసి సెప్టెంబర్‌లో మళ్లీ నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించడంపై రాహుల్‌గాంధీ ఫైరయ్యారు. ఎన్టీఏ తప్పులకు వేలాదిమంది విద్యార్థులు మూల్యం చెల్లించాల్సి వస్తోందని విమర్శించారు.
ఎక్స్ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ.. ‘మోదీజీ.. మీ ఎన్టీఏ ఏం చేసిందో చూడండి. జూన్ 22 నుంచి 30 వరకు సోషియాలజీ, ఇంగ్లిష్, కామర్స్ యూజీసీ-నెట్ పరీక్షలు జరిగాయి. దాదాపు రెండు నెలల తర్వాత ప్రశ్నపత్రాల్లో లోపాలు, గత ప్రశ్నల పునరావృతం కారణంగా ఈ మూడు పరీక్షలను ఎన్టీఏ రద్దు చేసింది. ఎన్టీఏ నిర్ణయంవల్ల ఏళ్ల తరబడి పరీక్షకు సిద్ధమైన వేలాది మంది అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవడం, ఫీజులు చెల్లించడం, దూర ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు ప్రయాణించాల్సి రావడం జరుగుతోంది. తప్పు చేసింది ఎన్టీఏ.. కానీ శిక్ష అనుభవించేది మాత్రం విద్యార్థులా..?’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
పరీక్షా వ్యవస్థ విద్యార్థులను దోపిడీచేసే వ్యవస్థగా మార్చిందని రాహుల్ ఆరోపించారు. దేశంలో సరైన పరీక్షా వ్యవస్థ లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను కోటా, డెహ్రాడూన్, ప్రయాగ్‌రాజ్‌లలో ఇదే విషయాన్ని ప్రస్తావించానన్నారు. ‘ఇది విద్యావ్యవస్థ కాదు.. డబ్బు, కాలం, మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని తీసుకుని చివరికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని వ్యవస్థగా మారింది’ అని రాహుల్ విమర్శలు గుప్పించారు. యూజీసీ-నెట్ ప్రశ్నపత్రాలు పరీక్షకు ముందే లీకయ్యాయా..? అని ఆయన సందేహం వ్యక్తంచేశారు. ఈ ప్రశ్నకు ఎన్టీఏ ఎందుకు సమాధానం చెప్పడంలేదని ప్రశ్నించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మొదటి అడుగు మాత్రమేనన్న రాహుల్ గాంధీ.. ఎన్టీఏ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేని వ్యవస్థను నిర్మించిందని విమర్శించారు. దాంతో విద్యార్థుల సంవత్సరాలు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పేవరకు తాము ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు.