అశ్వారావుపేట, జూలై 4 : అన్నదాతపై కేంద్ర ప్రభుత్వం మరో పిడుగు వేసింది. వ్యవసాయ పంటలకు కచ్చితంగా వినియోగించాల్సిన పొటాష్ ధరను అమాంతం పెంచేసింది. ఇప్పటికే యూరియా, డీఏపీ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు పెరిగిన పొటాష్ ధర మరింత ఆర్థిక భారమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 5.91 లక్షల ఎకరాల్లో సాగవుతున్న వివిధ పంటలకు సుమారు 17,730 మెట్రిక్ టన్నుల పొటాష్ అవసరం ఉంటుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఈ లెక్కన జిల్లా రైతాంగంపై పెరిగిన పొటాష్ ధర పెంపుతో రూ.8.87 కోట్ల వరకు అదనంగా భారం పడనుంది.
వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు చేదు కబురు చెప్పింది. గుట్టుచప్పుడు కాకుండానే పొటాష్ ధరను భారీగా పెంచింది. వాస్తవంగా జూలై 5వ తేదీ నుంచి కొత్త ధర అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ కంపెనీలు పెరిగిన ధరలతో పొటాష్‌ను సరఫరా చేస్తున్నాయి. దీంతో ముందస్తుగానే ప్రభుత్వ సహకారంతో కంపెనీలు దోపిడీకి తెరలేపాయి.
నిన్నటి వరకు పాత ధర రూ.1,550 ఉండగా.. పెరిగిన ధరతో రూ.1,800లకు చేరింది. ఇదిలా ఉంటే.. డీలర్లు ఉన్న నిల్వలను పెరిగిన ధరను బూచీగా చూపుతూ రూ.1,700 వసూలు చేస్తున్నారు. పెరిగిన పంట పెట్టుబడితో ఆర్థికంగా చితికిపోతున్న రైతులను పెరిగిన పొటాష్ ధర మరింత కుంగదీస్తున్నది. ఇప్పటివరకు పంటలను పండించడం ఒక ఎత్తు అయితే దానిని అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పుడు పంటలు పండించేందుకు కూడా అవస్థలు తప్పడం లేదు.
పొటాష్ ధరను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఇప్పటివరకు 50 కిలోల బస్తా ధర రూ.1,550 ఉండగా.. పెరిగిన ధరతో రూ.1,800లకు చేరింది. 50 కిలోల బస్తా ధరను కేంద్ర ప్రభుత్వం ఏకంగా 250 పెంచింది. కంపెనీ తయారీ ఖర్చు రూ.1,871.40 అవుతుండగా.. కేంద్ర ప్రభుత్వం రూ.71.40 సబ్సిడీ ఇస్తున్నది. మిగతా రూ.1,800లకు కంపెనీలు పొటాష్‌ను సరఫరా చేస్తున్నాయి. వ్యవపాయం చేసే ప్రతి రైతు పంటల బలం కోసం పొటాష్‌ను కచ్చితంగా వినియోగిస్తాడు. పంటల సాగు ప్రారంభానికి ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన లేకుండా పొటాష్ ధర పెంచి రైతుల నడ్డి విరిచింది.
కేంద్ర ప్రభుత్వం పొటాష్ ధర పెంచడంతో జిల్లా రైతులపై అదనంగా రూ.8.87 కోట్ల భారం పడుతున్నది. జిల్లావ్యాప్తంగా 5.91 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఇందులో 2.05 లక్షల ఎకరాల్లో పత్తి, 1.63 లక్షల ఎకరాల్లో వరి, 85 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 15 వేల ఎకరాల్లో మిర్చి, 5 వేల ఎకరాల్లో వేరుశనగ, 75 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం, 43 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగవుతున్నాయి. ఈ లెక్కన 17,730 మెట్రిక్ టన్నుల పొటాష్ అవసరం ఉంటుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. పెరిగిన ధర ప్రకారం సుమారు రూ.8.87 కోట్లు రైతులపై అదనపు భారం పడుతోంది. సుమారు ఐదేళ్ల కిందట బస్తా పొటాష్ ధర రూ.700 నుంచి రూ.800 మధ్య ఉందని, ఇప్పుడు ఆ ధర రూ.1,800లకు చేరడం పట్ల రైతులు మండిపడుతున్నారు.
భారీగా పెరుగుతున్న సాగు ఖర్చు దృష్ట్యా ఎరువుల ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని రైతులు ప్రాధేయపడుతున్నారు. గత ఐదేళ్ల సాగు వ్యయ అంచనా మూడింతలకు పెరిగిపోయిందని, అయినా కూలీల కొరత ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నిరకాల సాగు ఖర్చుల భారం రైతులకు మోయలేనంతగా పెరిగిపోయాయని వ్యవసాయ రైతు సంఘం నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వాల నుంచి వచ్చే రాయితీ పిసరంత ఉంటే.. ధరల పెంపు కొండంతలా పెరిగిపోతున్నాయని అసహనం వెలిబుచ్చుతున్నారు. ఇప్పుడు పంటలు సాగు చేయడం, పండించిన పంటలకు అమ్ముకోవడం కూడా రైతులకు కష్టంగా మారిపోతున్నాయని పేర్కొంటున్నారు.
పంటల పెట్టుబడి ఇటీవల కాలంలో మూడింతలు పెరిగింది. కూలీల కొరతతోపాటు విత్తనాలు, ఎరువుల ధరలు రైతులను ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. ప్రభుత్వ రాయితీలు కూడా నానాటికీ తగ్గిపోతున్నాయి. మార్కెట్లో ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇవే పరిస్థితులు కొనసాగితే వ్యవసాయం చేయడం రైతుల వల్ల కాదు.
– వేముల సర్వేశ్వరరావు, రైతు, అశ్వారావుపేట
పొటాష్ ధర పెరిగిన సమాచారం వచ్చింది కానీ ఇంకా సర్క్యులర్ అందలేదు. పాత నిల్వలను కొత్త ధరలకు విక్రయిస్తే డీలర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. బస్తాపై ఉన్న ఎమ్మార్పీకే డీలర్లు అమ్మకాలు జరపాలి. రైతులు కూడా రసీదులు తీసుకుని భద్రపరుచుకోవాలి. రైతు ఫిర్యాదులపై చర్యలు తప్పక ఉంటాయి.
– రవికుమార్, వ్యవసాయ సహాయ సంచాలకులు, అశ్వారావుపేట