వెంకటాపూర్, డిసెంబర్ 4 : భూకంపం విషయం తెలుసుకున్న కేంద్రం పురావస్తు శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై పాలంపేటలోని రామప్ప ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ఏమైనా పగుళ్లు ఏర్పడ్డాయా?, కప్పు భాగంలో చీలికలు వచ్చాయా? అని కేంద్ర పురావస్తు శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ హెచ్.ఆర్.దేశాయ్, ఏఈ కె.కృష్ణ చైతన్య, సీఏ నవీన్ కుమార్లతో కలిసి పరిశీలించారు. అనంతరం వారు అర్చకులు, సిబ్బందిని కలిసి ఏమైనా తేడాలు గమనించారా అడిగి తెలుసుకున్నారా? గతంలో ఏర్పడిన పగుళ్లు అదే విధంగా ఉన్నాయా, ఎక్కువ అయ్యాయా అని తరచి చూశారు. బుధవారం సంభవించిన భూకంపం వల్ల దేవాలయానికి ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు స్పష్టంచేశారు.
మహబూబాబాద్ రూరల్ : ఉదయం పూట కిరాణా షాప్ తీసి కౌంటర్లో కుర్చున్నా. కస్టమర్లు చక్కెర, టీ పొడి కావాలని వచ్చిండ్రు. బస్తాలో ఉన్న షుగర్ తీసి కాంటాలో పెట్టినప్పుడు ఒక్కసారిగా కాంటా అటు ఇటుగా కదిలింది. పైన ఉన్న రేకులు కదిలినట్లు సౌండ్ వచ్చింది. కిరాణా షాప్లో పెట్టిన సామాన్లు మొత్తం కదిలాయి. నాకు ఒక్కసారే కండ్లు తిరిగినట్లు అనిపించింది. షాప్ పక్కన ఉన్న వారు రోడ్డుపైకి ఉరికారు. వెంటనే షాప్లోంచి బయటకు వచ్చిన. అర్ధగంట వరకు చాలా భయం అయింది. ఇండ్లలో ఉన్న జనాలందరు రోడ్లపైకి వచ్చారు.
– షేక్ వహీదా, బేతోలు