ఆరుగాలం కష్టించి, ప్రకృతి వైపరీత్యాలను ఎదిరించి తీరా పంట చేతికొచ్చేసరికి పత్తి రైతు చతికిలపడడం సర్వసాధారణమైంది. గతేడాది అనావృష్టి కారణంగా పెద్దగా సాగు చేపట్టని ఖమ్మం జిల్లా రైతులు ఈ ఏడాది కోటి ఆశలతో పత్తిని అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. అయితే తాము ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలిచింది అన్నట్లు తయారైంది పరిస్థితి.
ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంతో అన్నదాతలను కష్టాలు వెంటాడుతున్నాయి. పత్తి సాగుకు ఖమ్మం జిల్లా పెట్టింది పేరు.. సారవంతమైన భూములు, అనుభవం కలిగిన రైతులు ఉన్నప్పటికీ కొన్నేండ్లుగా ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు. జిల్లాలో ఏటా దాదాపు 2 లక్షల ఎకరాలకు పైబడి పత్తి సాగు చేస్తున్న రైతులు ఈ ఏడాది సైతం ఒకవైపు దిగుబడి లేక.. మరోవైపు గిట్టుబాటు ధర రాక దిగాలు చెందుతున్నారు.
– ఖమ్మం, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
గడిచిన ఏడాదికాలంగా ఖమ్మం జిల్లా రైతులను ప్రకృతి వైపరీత్యాలు పగబట్టినట్లు వెంటాడుతున్నాయి. దీంతో అన్నదాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోయిన యాసంగిలో సాగర్ కాల్వ నీటి విడుదల జరగకపోవడంతో జిల్లావ్యాప్తంగా యాసంగి సాగుకు బ్రేక్ పడింది. కనీసం పదిశాతం సాగు జరగలేదు. అయితే ఈ వానకాలంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఆశించిన మేర వర్షపాతం నమోదు కాలేదు. అయినప్పటికీ రైతులు తడిపొడి దుక్కిలోనే పత్తి విత్తనాలు నాటారు. అనేక చీడపీడల బెడద నుంచి పంటను కాపాడుకున్నప్పటికీ ఇటీవల కురిసిన భారీ వర్షాలు పత్తి పంటపై తీవ్ర ప్రభావం చూపాయి.
జిల్లాలో అనేకచోట్ల పైర్లు నేలకొరిగాయి. కొన్ని మండలాల్లో ఊటలు పుట్టి పంట దెబ్బతిన్నాయి. వర్షాల అనంతరం సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పటికీ ఆశించిన మేర పంట ఏపుగా పెరగకపోవడంతో ఆ ప్రభావం దిగుబడిపై స్పష్టంగా కనిపిస్తున్నది. ఏటా వానకాలంలో మూడు, నాలుగుసార్లు పత్తి తీతలు తీస్తే ఎకరానికి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉండేది. అయితే ఈ సంవత్సరం రెండుతీతలకు మించి పంట రాదని, ఎకరానికి అతికష్టంపై ఐదు క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. పెట్టుబడి కూడా తీరడం కష్టంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సీజన్ ప్రారంభమయ్యిందంటే చాలు సర్కార్ సాయం కార్యక్రమాలు ఎంతో చురుగ్గా జరిగేవి. సీజన్‌కు ముందుగానే సాగు ప్రణాళిక సిద్ధం చేయడంతోపాటు అందుకనుగుణంగా విత్తనాలు, ఎరువులను సొసైటీలకు తరలించడం జరిగేది. ఏ ఒక్క రైతుకు విత్తన, ఎరువుల కొరత లేకుండా పదేండ్లపాటు విజయవంతంగా అమలు జరిగింది. పంటల పెట్టుబడి(రైతుబంధు) నిధులు సైతం తీరా సాగుకు శ్రీకారం చుట్టే సమయంలోనే 2018 నుంచి విధిగా నేరుగా రైతుల అకౌంట్లో జమకావడం, పంట చేతికొచ్చే సమయంలోగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేవి.
కానీ.. కాంగ్రెస్ సర్కార్‌లో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. పంటల పెట్టుబడికి ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు ఇంతవరకు అతీగతీ లేదు. తీరా పంట మార్కెట్‌కు సైతం వస్తున్నప్పటికీ ఆ ఊసే లేకుండా పోయింది. రైతు రుణమాఫీ తీరు సైతం అనేక విమర్శలకు తావిస్తున్నది. రూ.2 లక్షలలోపు రైతులకు సైతం పూర్తిస్థాయిలో అమలుకాలేదు. దీంతో సర్కార్ నుంచి ఏమాత్రం సాయం లేకపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ ఏడాది జిల్లాలోని ఆయా మార్కెట్ల పరిధిలో ఉన్న తొమ్మిది జిన్నింగ్ మిల్లులను సీసీఐ కేంద్రాలుగా గుర్తించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ క్రయవిక్రయాలకు మాత్రం నోచుకోవడం లేదు. పదిహేనురోజుల నుంచి ఖమ్మం మార్కెట్‌కు రోజుకు 5 వేల పత్తి బస్తాలను రైతులు తీసుకొస్తున్నారు. మార్కెట్లో గరిష్ఠ ధర క్వింటాల్ రూ.7 వేలు పలుకుతున్నప్పటికీ ఆ ధర ఒకరిద్దరు రైతులకే పరిమితమవుతున్నది. మిగిలిన రైతులకు క్వింటాల్ రూ.6 వేల నుంచి రూ.6,500 వరకు మాత్రమే పలుకుతున్నది.
భారత పత్తి సంస్థ(సీసీఐ) కొనుగోళ్లు చేపట్టకపోవడం కాదు కదా కనీసం కేంద్రాల ఊసేలేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు తమకు నచ్చిన రీతిలో ధర పెడుతుంటే ఇష్టం లేకున్నా రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో పక్షంరోజుల వరకు సీసీఐ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశం లేదని జిన్నింగ్ మిల్లుల యజమానులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది రైతుల పేరుతో వ్యాపారులు సీసీఐ కేంద్రాలకు పంటను తరలించే అవకాశం వందకు వందశాతం ఉందనే చర్చ కొనసాగుతున్నది. తేమ శాతం లేదని కాలయాపన చేస్తున్న సీసీఐ అధికారులు చివరికి వ్యాపారుల వద్దనే కొంటారని వారు బహిరంగంగానే చర్చించుకోవడం విశేషం. ఏదేమైనా సకాలంలో సీసీఐ కేంద్రాలు ప్రారంభమైతే తప్ప పత్తి రైతులు మద్దతు ధర పొందడం అసాధ్యం.
మార్కెట్‌కు పంటను తీసుకొస్తే ఏడ్చుకుంటూ తేవడం, తిరిగి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లడం జరుగుతున్నది. మద్దతు ధర ఇస్తాం అని ఇంతకాలం చెప్పారు. కానీ.. ఇంతవరకు సీసీఐ కేంద్రాలే ప్రారంభం కాలేదు. రైతుల నుంచి పంట అయిపోయిన తర్వాత పంటను కొన్నట్లు చేస్తారు.. కానీ.. అది రైతుల పంట కాదు. వ్యాపారుల వద్ద రైతుల పేరుతో ప్రతి ఏటా కొంటున్నారు. రైతు భరోసా లేదు.. రుణమాఫీ లేదు.
– మద్దినేని వెంకటేశ్వర్లు, రైతు, నాగిలిగొండ, చింతకాని మండలం
సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను వెంటనే కొనుగోలు చేయాలి. నిబంధనలు లేకుండా పంటను కొంటేనే రైతులకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మార్కెట్ నిండా కొత్త పత్తి పంట కనపడుతున్నది. కానీ.. సీసీఐ కేంద్రాలు మాత్రం కనపబడడం లేదు. ఒకవైపు వానలు బాగా కొడుతున్నాయి. మరోవైపు కొద్దిరోజుల్లో చలి వస్తుంది. ఇట్లాంటి పరిస్థితిలో తేమ శాతం 12లోపు ఎలా ఉంటుంది. అధికారులు ఆలోచన చేసి నిబంధనలు లేకుండా కొంటేనే పత్తి రైతులకు న్యాయం జరుగుతుంది.
-రావూరి కృష్ణారావు, రైతు, మునిగపల్లి, కూసుమంచి మండలం