ఖమ్మంరూరల్, అక్టోబర్ 21: తేమ, తూకాల పేరుతో దళారులు రైతులను మోసం చేస్తే కఠినచర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడుసమీపంలోని జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్లు వద్ద ఏర్పాటు చేసిన భారత పత్తి సంస్థ(సీసీఐ) కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సోమవారం ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మార్కెటింగ్‌శాఖ రూపొందించిన పత్తి రైతు అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ తేమశాతం, నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. పంట పూర్తిగా ఆరబెట్టి తీసుకొస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో అర్థమయ్యే రీతిలో రైతులకు అవగాహన కలిగించాలన్నారు.
ప్రైవేట్ మార్కెట్లో సైతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ప్రస్తుత తరుణంలో పత్తి, మిర్చి ఇతర పంటల కంటే ఉద్యాన పంటల సాగు ఎంతో మేలన్నారు. సంప్రదాయ పంటల సాగుకు రైతులు స్వస్తి పలికి ఆయిల్‌పామ్ సాగుకు మందుకురావాలని పిలుపునిచ్చారు. అదనపు కలెక్టర్ శ్రీజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మద్దులపల్లి ఏఎంసీ చైర్మన్ హరినాథబాబు, అధికారులు అలీం, పుల్లయ్య, సరిత, ఉమానగేశ్, ప్రవీణ్‌కుమార్, వీరాంజనేయులు పాల్గొన్నారు.