మణుగూరు టౌన్/ ఇల్లెందు, సెప్టెంబర్ 1 : ‘బీటలు వారిన బీడు భూములను సస్యశ్యామలం చేసి కోటి ఎకరాల మాగాణికి సాగు నీళ్లు ఇచ్చినందుకేనా కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశం’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నిలదీశాయి. తెలంగాణ సాధకుడిని, ఆయన నిర్మించిన తెలంగాణ జీవనాడిని అబాసుపాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని నిరసిస్తూ భద్రాద్రి జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మణుగూరులో పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో భారీ ప్రదర్శన, భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు.
అలాగే, ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. అనంతరం అక్కడే ధర్నా నిర్వహించారు. అనంతరం అదే ఇల్లెందులోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, ఉద్యమ నేత దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మణుగూరులో రేగా కాంతారావు మాట్లాడుతూ.. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈర్ష్య పడుతోందని విమర్శించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమనేత కేసీఆర్‌ను అప్రతిష్టపాలు చేయాలనే కుట్రలో భాగంగా కాళేశ్వరంపై ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆరోపించారు. కోటి ఎకరాలకు నీళ్లను అందించే ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఇల్లెందులో హరిప్రియ మాట్లాడుతూ.. కాళేశ్వరం నిర్మించి వరి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను మొదటి స్థానంలో నిలిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
మరో కార్యక్రమంలో దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో అతి తక్కువ కాలంలో అతి పెద్ద సాగునీటి ప్రాజెక్టు నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీళ్లు అందించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా, తెలంగాణ జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపైనా నిందలు సరికావని అన్నారు. కాళేశ్వరాన్ని, కేసీఆర్‌ను అప్రతిష్టపాలు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. సరైన నీటి సౌకర్యం లేక, విద్యుత్ సౌకర్యం లేక అల్లాడిన రైతులకు ఆదెరువుగా నిర్మించిన కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ఎంక్వైరీ వేయడం తగదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతుల పాలిట కేసీఆర్ అన్నదాతగా నిలిచారు. దీనిని ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం తీరొక్క నాటకం ఆడుతోంది. రైతుల పంట భూములకు సాగు నీరందించడానికి ఢోకా లేకుండా చేశారు. దేశంలోనే అత్యుత్తమైన సుప్రీం కోర్టు కాళేశ్వరం ప్రాజెక్టు శెభాష్ అని మెచ్చుకున్నది. దేశంలోని రాజకీయ నాయకులు సైతం కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరమని కొనియాడారు. అలాంటిది.. కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసీఆర్‌పై విషం చిమ్ముతుంది. ఎంక్వైరీ ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
– టీవీ రామారావు, విశ్రాంతి ఉద్యోగుల సంఘం పెనుబల్లి మండల అధ్యక్షుడు
మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు కుంగితే కాళేశ్వరం మొత్తం కూలిపోయినట్లు ప్రచారం చేయడం.. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నంలో భాగమే. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంది. ఎంక్వైరీ పేరుతో సీబీఐకి అప్పగించడం అన్యాయం. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన కాంగ్రెస్ నిందారోపణలు చేసి పనికిరాని ప్రాజెక్టుగా వర్ణించడం బాధాకరం. లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చి కోనసీమను తలపించేలా పంటలు పండిన విషయాన్ని మరువొద్దు.
-సంకా ప్రసాదరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, అశ్వారావుపేట