గడిచిన పదేళ్లుగా మండు వేసవిలోనూ నిండుగా తొణికిసలాడిన తటాకాలు.. ఈ ఏడాది మార్చిలోనే ఎండిపోయాయి. నాడు జలకళను సంతరించుకున్న చెరువులన్నీ నేడు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల స్పష్టం చేసిన విధంగా ఇదంతా కాలం తెచ్చిన కరువు కాకుండా.. కాంగ్రెస్ తెచ్చిన కరువులా కనిపిస్తుందనడంలో సందేహం లేదు. గత కేసీఆర్ ప్రభుత్వం జలాశయాలను నీటితో నింపుతూ వస్తే.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అదే జలాశయాలను ఖాళీ చేస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా గత కేసీఆర్ ప్రభుత్వం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా దాని ఆయకట్టు కింద జలవనరులన్నింటినీ నింపింది.
కానీ.. ఇటీవల వచ్చిన కాంగ్రెస్ ఏపీతో దోస్తీ చేసి నాగార్జున సాగర్ ప్రాజెక్టును కృష్ణా జలాల నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించింది. దీంతో గడిచిన పదేళ్లుగా సాగర్ జలాలతో నిండుతున్న ఆయకట్టు చెరువులన్నీ ఈ ఏడాది ఎండిపోతున్నాయి. మధిర నియోజకవర్గంలోని బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం, ముదిగొండ, చింతకాని మండలాల్లో 122 చెరువులు ఉన్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా సుమారు రూ.20 కోట్లు వెచ్చించి వీటన్నింటికీ మరమ్మతులు చేయించింది.
ఫలితంగా నీటి నిల్వలు, భూగర్భ జలాలు పెరిగాయి. అటు వర్షాలతోపాటు ఇటు సాగర్ జలాలూ అందేవి. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఆ చెరువులన్నీ అడుగంటాయి. కనీసం పశువులు తాగేందుకు కూడా నీళ్లు లేవు. ఇక యాసంగి పంటలు, తాగునీటి నిల్వల సంగతి సరేసరి. స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం అయినప్పటికీ చొరవ తీసుకొని చెరువులు నింపే పరిస్థితి లేదు. బోనకల్లు మండలం రావినూతల గ్రామంలోని ఈ చెరువే ఇందుకు నిదర్శనం. -మధిర, మార్చి 13