కేంద్రాలను పరిశీలించిన ఉభయ జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీస్ బందోబస్తు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల కళ్లలో టెన్షన్.. టెన్షన్.. ఎక్కడా చూసినా హడావుడి.. కేంద్రం బయట వివిధ పార్టీలకు చెందిన శ్రేణుల ఎదురుచూపులు.. ఏ పార్టీ గెలుస్తుంది.. ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓటమి పాలవుతారనే ఉత్కంఠ మధ్య ఆదివారం ఖమ్మం జిల్లా రూరల్ మండలం పొన్నెకల్లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాల, భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణంలోని అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం ఉమ్మడి జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది.
నిన్నమొన్నటి వరకు ‘నేను గెలుస్తాను అంటే.. నేను గెలుస్తాను..’ అని, ‘గెలిచేది నువ్వా? నేనా..?’ అని సవాల్ విసుకురుకున్న ఎమ్మెల్యే అభ్యర్థులు ఓట్ల లెక్కింపు కేంద్రంలో పలకరించుకున్నారు. పక్కపక్కనే కూర్చొని లెక్కింపు సరళిని పరిశీలించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు సాగింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ మొదట షురూ అయింది. కేంద్రాలను ఉభయ జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక, ఖమ్మం సీపీ విష్ణు, భద్రాద్రి ఎస్పీ వినీత్ గంగన్న పరిశీలించారు. – నమస్తే నెట్వర్క్