గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోరుకు ప్రచార ఘట్టం ముగిసింది. సార్వత్రిక ఎన్నికలను తలపించేలా కొనసాగిన ప్రచార పర్వం గ్రామాల్లో హోరెత్తించింది. తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు గ్రామ రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు పది రోజులపాటు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయడం ద్వారా చెమటోడ్చారు. గ్రామాలపై పట్టు సాధించాలన్న లక్ష్యంతో అధికార విపక్షాలన్నీ తామై అభ్యర్థులను నడిపించే ప్రయత్నం చేశాయి.
పంచాయతీ ఎన్నికలు గతంకంటే అత్యంత వ్యయ భరితంగా మారాయని అభ్యర్థుల్లో అనేకమంది ఆవేదన వ్యక్తం చేసే రీతిలో ఎన్నికల పోరు కొనసాగింది. గ్రామాభివృద్ధికి తాము చేయనున్న కృషి గురించి ఎన్నికల ప్రణాళిక రూపంలో మైకుల ద్వారా ప్రచారాన్ని హోరెత్తించారు. తమకు మద్దతు ఇస్తున్న పార్టీ నేతల అండదండలు ఉన్నాయన్న అర్థాన్ని సూచించేలా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సర్పంచ్ అభ్యర్థులు.. గ్రామాల అభివృద్ధితోపాటు గ్రామానికి కల్పించనున్న మౌలిక వసతులపై ఇంటింటా ప్రచారం చేశారు.
ఖమ్మం, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దాదాపు పది రోజులపాటు కొనసాగిన ప్రచారం ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ప్రచార పర్వం ముగిసింది. పోలింగ్‌కు ఒక రోజు మాత్రమే సమయం ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కొందరు అభ్యర్థులు తమదైన రీతిలో ప్రలోభాల పర్వానికి తెరతీశారు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా కొందరు అభ్యర్థులు గ్రామాల్లో ముక్క, చుక్క పంపిణీ చేస్తుండడం గమనార్హం. పదిరోజులపాటు జరిగిన ఎన్నికల ప్రచార ప్రక్రియలో బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సర్పంచ్, వార్డు అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, జిల్లా, రాష్ట్ర నేతలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.
ఖమ్మం జిల్లాలో రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, చంద్రావతి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ సతీమణి మంజుల తదితరులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. భద్రాద్రి జిల్లాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకుడు రావులపల్లి రాంప్రసాద్‌లు తదితరులు విస్తృత ప్రచారం చేశారు.
బీఆర్ఎస్, సీపీఎం పొత్తు
ఈ ఎన్నికలోల బీఆర్ఎస్, సీపీఎం పొత్తుతో పోటీ చేస్తుండడం ప్రత్యర్థులకు గుబులు పుట్టిస్తోంది. నిర్మాణపరంగా బీఆర్ఎస్, సీపీఎం గ్రామస్థాయిలో పటిష్టంగా ఉండడంతో ఓట్ల బదిలీ సునాయాసంగా జరుగుతుందని; బీఆర్ఎస్, సీపీఎంలకు విజయావకాశాలు ఉంటాయని ఆయా పార్టీల నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ నెల 11న మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ప్రచారం ముగిసింది. రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఈ నెల 12న, అలాగే 17న ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఈ నెల 15న ప్రచారానికి తెరపడనుంది. కాగా, 11న జరిగే తొలివిడత ఎన్నికలకు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు.