ధరల చదరంగంలో మిర్చి రైతులు నిలువునా దగా పడ్డారు. కాచుకొని కూర్చున్న వ్యాపారులు.. అదును చూసి దెబ్బకొట్టారు. నిరుడు ఇదే సీజన్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్వింటాకు రూ.22 వేల చొప్పున వెచ్చించిన ఖరీదుదారులు.. ఈ ఏడాది సీజన్ నాటికి ధరలను అమాంతం తగ్గించారు. ఖరీదుదారుల వ్యూహానికి ధరలు నేలచూపులు చూస్తుండడంతో ఎర్ర బంగారం రైతులు బోరుమంటున్నారు. నిరుడు క్వింటా మిర్చిని రూ.22 వేల నుంచి రూ.23 వేల మధ్య కొనుగోలు చేయడంతో అన్నదాతలు ఈ పంట సాగుకు ఆశలు పెంచుకున్నారు. ఈ ధర మరికొంత పెరుగుతుందేమోనని కొందరు రైతులు కోల్డ్ స్టోరేజీల్లో భద్రపర్చుకున్నారు. ఇప్పుడు ధరలు దారుణంగా తగ్గడంతో నెత్తీనోరూ బాదుకుంటున్నారు.
అలాగే, నిరుడు మంచి ధర పలికినందున ఈ ఏడాది కూడా అదే ధరలు ఉంటాయనుకొని మరికొందరు అధిక విస్తీర్ణంలో పంటను సాగు చేశారు. కాలం కలిసి రాకున్నా, తెగుళ్లు సోకినా, పెట్టుబడులు గణనీయంగా పెరిగినా వెరవకుండా పంట సాగు చేశారు. రేయింబవళ్లూ చెమటోడ్చి పంటను కల్లాలకు చేర్చారు. తీరా చూస్తే ధర మాత్రం అధఃపాతాళంలో ఉంది. దీంతో మిర్చి రైతులందరూ గుండెలు బాదుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా మిర్చి ధర రూ.12 వేలు మాత్రమే పలుకుతుండడంతో నిలువునా నష్టపోతున్నామంటూ తలలు బాదుకుంటున్నారు.
– జూలూరుపాడు/ చర్ల/ చండ్రుగొండ/ ఇల్లెందు రూరల్, ఫిబ్రవరి 18
పంటల సాగులో ఏళ్లకేళ్లుగా వస్తున్న నష్టాలు ఈ సారైనా తీరుతాయన్న ఆశతో ఏటా సాగును కొనసాగిస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్నదాతలు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యాన్ని కూడగట్టుకొని పంటల సాగులోనే పయనిస్తున్నారు. ఈ క్రమంలో కష్టాలను ఓర్చుకుంటున్నారు. నష్టాలను దిగమింగుతున్నారు. కానీ.. వ్యాపారుల వ్యూహంతో వారు అంతకుమించిన కష్టనష్టాల్లో చిక్కుకుంటున్నారు. అప్పుల ఊబిలో విలవిల్లాడుతున్నారు. ఒక్కోసారి బలవన్మరణాలకూ నిర్ణయం తీసుకుంటున్నారు. ధరల విషయంలో రైతులు ఎలా దగా పడుతున్నారనే అంశం.. కొన్ని మండలాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే పూర్తిగా అవగతమవుతోంది. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు, చర్ల మండలాల రైతులు నిరుడు 4 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. క్వింటాకు సుమారు రూ.22 వేల ధర పలకడంతో ఈ ఏడాది మరో వెయ్యి ఎకరాలను పెంచి మొత్తం 5 వేల ఎకరాల్లో మిర్చి పంటను వేశారు.
ఎకరాకు సుమారుగా రూ.లక్ష పైగా పెట్టుబడి పెట్టారు. స్థానికంగా కూలీల కొరత ఏర్పడటంతో ఇతర రాష్ర్టాల నుంచి వాహనాల్లో కూలీలను తెప్పించుకొని మరీ మర్చి పంటలు కోశారు. మిర్చి తోటల వద్ద కూలీలకు అన్ని సౌకర్యాలూ కల్పించారు. ఇలా మిర్చి కోతలకే ఎకరానికి సుమారు రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. కానీ.. ఇంతలా శ్రమించి మిర్చిని కోసి మార్కెట్కు తీసుకెళ్తే ధరలు మాత్రం దారుణంగా పతనమై కన్పిస్తున్నాయి. నాణ్యతను బట్టి బహిరంగ మార్కెట్లో క్వింటా మిర్చి ధర రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు మాత్రమే పలుకుతోంది. దీంతో మిర్చి రైతుకు కంటతడి తప్ప మరేమీ లేకుండా పోతోంది. మరుసటి ఏడాది వరకూ కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచుదామంటే ఇప్పుడు పెట్టుబడులు పూడే మార్గం కన్పించడం లేదు. పైగా నిరుటి అనుభవం దృష్ట్యా అప్పటి ధర ఎలా ఉంటుందోనన్న అనుమానాలు వెంటాడుతున్నాయి. దీంతో కొందరు రైతులు ఇదే ధరలకు తెగనమ్ముకుంటుండగా.. మరికొందరు రైతులు మాత్రం తమ పంటను కల్లాల్లోనే నిల్వ ఉంచుకొని ధరల పెరుగుదల కోసం ఎదురుచూస్తున్నారు.
ధరల విషయంలో మిర్చి రైతులు ఎలా దగా పడుతున్నారో ఇటీవలి వాటి కదలికలు చూస్తే పూర్తిగా అవగతమవుతోంది. ఇల్లెందు, చండ్రుగొండ మండలాల్లో క్వింటా మిర్చి ధర సుమారు రూ.13 వేల నుంచి రూ.14 వేల మధ్య పలుకుతోంది. నాణ్యత ఉన్నప్పటికీ బహిరంగ మార్కెల్లో సుమారు రూ.12 వేలకు మించి పెట్టడం లేదు. జనవరి నెలలో రూ.17 వేల నుంచి రూ.18 వేల వరకూ పలుకగా.. ఫిబ్రవరిలో రూ.13 వేల నుంచి రూ.14 వేల వరకు మాత్రమే పలుకుతోంది. నెల రోజులు తిరగకముందే మరో రూ.6 వేలు తగ్గించి ఖరీదు చేస్తుండడంతో మిర్చి రైతుల ఆశలన్నీ అడియాశలయ్యాయి.
గత కేసీఆర్ ప్రభుత్వంలో క్వింటా మిర్చి పంట ధర రూ.22 పలికింది. ఇప్పుడు ఎక్కడా ఆ ధర పలకడం లేదు. నేను ఆరు ఎకరాల్లో మిర్చి పంట వేశా. గిట్టుబాటు ధర లేకపోవడంతో పంటనంతా కల్లంలో కుప్పగా పోసి ఉంచా. ధరలు లేవు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. క్వింటాకు రూ.20 వేల గిట్టుబాటు ధర కల్పించాలి.
-లచ్చు, మిర్చి రైతు, తుంటబాలుతండా, ఇల్లెందు
మిర్చి సాగులో ఈ ఏడాది లాభాలు వచ్చే పరిస్థితి లేదు. కనీసం అప్పులు తీరుతాయన్న ఆశ కూడా లేకుండా పోయింది. పండిన పంటను గిట్టుబాటు ధరకు కొనే నాథుడే లేడు. గత కేసీఆర్ ప్రభుత్వంలో మంచి ధర ఉండేది. ఇప్పుడు ధరలు సగానికి సగం తగ్గాయి. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు.
-ఇమ్మడి సంపత్, మిర్చి రైతు, చండ్రుగొండ
మిర్చి పంటను పండించి చాలా నష్టపోతున్నాం. నాలుగు ఎకరాల్లో మిర్చి సాగుచేశా. పంట చేతికొచ్చింది. దిగుబడి కూడా బాగానే వచ్చింది. కానీ.. మార్కెట్కు తీసుకెళ్లి అమ్ముకుందామంటే ఒక్కసారిగా ధర పడిపోయింది. మిర్చి పంట పండించేందుకు ఎంతో శ్రమకోర్చా. ఎంతో పెట్టుబడి పెట్టా. ఇప్పుడు ఇంతలా నష్టమొస్తోంది.
-బానోత్ శారద, తుంటబాలుతండా, ఇల్లెందు
ఈ ఏడాది మా ప్రాంతంలో మిర్చిపంట సాగు ఆశాజనకంగా లేదు. తోటలకు తెగుళ్లు ఆశించాయి. ఫలితంగా దిగుబడి తగ్గింది. పెట్టుబడి పెరిగింది. పోనీ మార్కెట్లో అమ్ముకుందామంటే కనీసం గిట్టుబాటు ధర కూడా లేదు. ఈ రేటులో అమ్మితే కనీసం పెట్టుబడి కూడా రాదు. పైగా ఇప్పుడు కరెంటు సమస్య వేధిస్తోంది.
-తన్నీరు సుబ్బారావు, రైతు, గొంపల్లి, చర్ల
ఎకరానికి రూ.లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టా. మిరప కాయలు కోయడానికి క్వింటాకు రూ.1000 ఖర్చయింది. గ్రామాలకు వచ్చే వ్యాపారులు క్వింటాకు రూ.12 వేలు మాత్రమే చెబుతున్నారు. కూలీల చెల్లింపులు, బాకీల జమల కోసం నాకు ఇప్పుడు డబ్బులు ఎంతో అవసరం. అందుకని ఇదే రేటుకు అమ్ముకోవాల్సి వచ్చింది.
-ఆనంగి తిరుపతయ్య, మిర్చి రైతు, చండ్రుగొండ
నేను ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి పంట వేశా. మిర్చి తోటలను ఎర్రనల్లి, కంకరు తెగులు ఆశించాయి. వాటి నివారణకు మందులు పిచికారీ చేశా. ఎకరానికి రూ.3 లక్షల వరకూ ఖర్చయింది. కానీ.. దిగుబడి తగ్గింది. ఇప్పుడు మొదటికోత పూర్తయింది. ప్రస్తుత ధరకు అమ్మితే సగానికి సగం నష్టమే వస్తుంది.
-బలుసు వెంకటేశ్వరరావు, రైతు, చింతకుంట, చర్ల