అశ్వారావుపేట, జూలై 26 : వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. పెరిగిన పంట పెట్టుబడులతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ, పండించిన పంటలకు గ్యారెంటీ లేనప్పటికీ.. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నందున అన్నదాతలందరూ అలాగే నెట్టుకొస్తున్నారు. దీతో ఎన్నికలప్పుడు అన్నదాతల జపం చేస్తున్న జాతీయ పార్టీలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోకపోగా వారిపై ఆర్థిక భారం మోపుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం యూరియా రవాణా చార్జీలను అన్నదాతల నెత్తిన పడేసింది. ఈ భారంతో పంట పెట్టుబడి మరింత పెరగనుంది.
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఏటా రైతులు 10 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందుకు వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 57 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతోంది. అంటే బస్తాకు 45 కేజీల చొప్పున సుమారు 12, 66,667 బస్తాల యూరియా రైతులకు పంపిణీ చేస్తోంది. ఇప్పుడు రవాణా చార్జీలను సొసైటీలే రైతుల నుంచి వసూలు చేసుకోవాలని ప్రభుత్వాలు స్పష్టం చేయడంతో ఆ భారం రూ.6.33 కోట్ల మేర ఏటా రైతుల నెత్తిన పడనుంది.
జిల్లాలో ఈసారి సరైన వర్షాలు లేకపోవడంతో విత్తనాలు వేసిన రైతులు, వరి నార్లు పోసిన అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ఇదే సమయంలో మరోపక్క యూరియా కష్టాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
యాప్‌తో నానా అవస్థలు పడుతున్నారు. ‘సందట్లో సడేమియా’ అన్నట్లుగా రైతన్నలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా రవాణా చార్జీల భారం మోపాయి. దీంతో ఒక్కో బస్తాకు సుమారు రూ.50 వరకు ఆర్థిక భారం పడనుంది. ఇప్పటి వరకు సొసైటీల ద్వారా రైతులకు పంపిణీ చేసే యూరియాకు రవాణా చార్జీలను ప్రభుత్వం భరించేది. దీంతో రైతులకు ఒక్కో బస్తా యూరియా రూ.267కు అందుబాటులో ఉండేది. ప్రైవేట్ వ్యాపారులకు రవాణా చార్జీల సబ్సిడీ లేకపోవడంతో వారు ఒక్కో బస్తాను సుమారు రూ.320కు పైగా విక్రయించాల్సి వచ్చేది. ఈ భారం తట్టుకోలేక అధిక ధరలు వసూలు చేస్తున్నారన్న అనుమానాల నేపథ్యంలో విక్రయాలను పూర్తిగా నిలిపివేశారు. ఇప్పుడు రవాణా చార్జీల భారం రైతులపైనే మోపడంతో ప్రైవేట్ డీటర్లు కూడా యూరియా విక్రయాలకు సిద్ధమవుతున్నారు.
మొన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా రైతులకు సరిపడా యూరియా అందించపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడిన విషయం విదితమే. దీంతో రైతుల నుంచి తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తమయ్యాయి. దీంతో కొరత నివారణపై చర్యలు తీసుకోలేక తాత్సారం చేసేందుకు యాప్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ యాప్ రైతులకు కొత్త కష్టాలను తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంత రైతులు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. స్మార్ట్ ఫోన్లు లేని చిన్న, సన్నకారు రైతులు యాప్ బుకింగ్‌పై అవగాహనలేక యూరియా కోసం తీవ్రంగా కష్టాలు వచ్చింది.
అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వారి అసంతృప్తి ఏమాత్రం తగ్గలేదు. ఇక లాభం లేదనుకున్న ప్రభుత్వాలు మీసేవా కేంద్రాల్లోనూ యూరియా బుకింగ్ చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించాయి. ఇందుకోసం రైతు రూ.10 చొప్పున మీసేవ కేంద్రాలకు సర్వీస్ చార్జీ చెల్లించాలని సూచించింది. ఇదో రకం భారమని భావిస్తున్న తరుణంలోనే ఇప్పుడు యూరియా రవాణా చార్జీలను రైతు నెత్తిన మోపింది. దీని ప్రభావంతో పంట పెట్టుబడిపై పెరుగుతుందని, ఆర్థికంగా తమకు భారమవుతుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
రవాణా చార్జీల భారం రైతుపై పడడంతో ఏటా సుమారు 6.33 కోట్లు భరించాల్సి వస్తుంది. ఏడాదిలో రెండు పంటలు కలిసి 10 లక్షలకుపైగా ఎకరాల్లో జిల్లా రైతులు వివిధ పంటలను సాగు చేస్తున్నారు. ఇందుకోసం 57 వేల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఒక్కో బస్తా 45 కేజీల చొప్పున ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. 57 వేల మెట్రిక్ టన్నుల యూరియా బస్తాల్లోకి వచ్చే సరికి 12,66,667 బస్తాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది.
ఒక్కో బస్తాకు రవాణా చార్జీ భారం రూ.50 వరకు ఉండొచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి రెండు పంటలకు కలిపి రవాణా చార్జీల భారం రూ.6.33 కోట్లు తాము భరించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క భద్రాద్రి జిల్లాలోనే ఇన్ని రూ.కోట్ల రవాణా చార్జీలను రైతులు భరించాల్సి వస్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని రూ.కోట్లు ప్రభుత్వం ఎగనామం పెడుతుందని రైతులు మండిపడుతున్నారు.
యూరియాపై రవాణా చార్జీల భారాన్ని రైతులపై ప్రభుత్వం మోపడం దారుణం. దీనివల్ల పంట పెట్టుబడి భారీగా పెరుగుతుంది. ఇప్పటికే వర్షాల్లేక, యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పండించిన పంటలను సకాలంలో ప్రభుత్వాలు కొనుగోలు చేయడం లేదు. దీనికి అకాల వర్షాలూ తోడతై అక్కడ కూడా నష్టపోతున్నాం. ఇది ముమ్మాటికీ దుర్మార్గం. రైతుల పట్ల ప్రభుత్వ వ్యతిరేక వైఖరి బయడపడుతుంది.
-మాడి బాలు, రైతు, అశ్వారావుపేట
ఎన్నికల సమయంలో రైతు జపం చేస్తున్న జాతీయ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయి. ఏదో రూపంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వ్యవసాయంపైనే ఆధారపడ్డ రైతులు ఎన్ని కష్టాలు ఎదురైనా పంటలు పండించక తప్పడం లేదు. రాయితీలను ఎత్తివేసే ప్రభుత్వం.. పంట గిట్టుబాటు ధర, పండించిన పంటల కొనుగోలుకు మాత్రం భరోసా ఇవ్వడం లేదు.
-గొగ్గిల ఆదినారాయణ, రైతు, ములకలపల్లి
సొసైటీల నుంచి పంపిణీ చేసే యూరియా బస్తాలపై రవాణా చార్జీలను ఇకపై రైతులే చెల్లించాలి. ఇప్పటి వరకు ఇస్తున్న చార్జీల రాయితీని ప్రభుత్వం ఎత్తివేసింది. జిల్లా వ్యాప్తంగా మార్క్‌ఫెడ్ నుంచి సొసైటీలకు సరఫరా చేసే యూరియా రవాణా చార్జీలను రైతులు తమ దూరాన్ని బట్టి భరించాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలకు సుమారు ఏడాదికి 57 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది.
-శ్రీనివాసరావు, డీసీవో, కొత్తగూడెం