కూసుమంచి (నేలకొండపల్లి), నవంబర్ 27: ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన ఇద్దరు మహిళలు ఏకంగా ఇంటి యజమానులైన వృద్ధ దంపతులను అతి దారుణంగా హత్య చేశారు. కలకలం సృష్టించిన ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో బుధవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. నేలకొండపల్లి కొత్త బస్టాండ్ సమీపంలో ఎర్రా వెంకటరమణ (60), అతడి భార్య కృష్ణవేణి (55) తమ సొంత ఇంట్లో ఉంటున్నారు. ఉద్యోగ రీత్యా కూతురు చెన్నైలో, కుమారుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో పది రోజుల క్రితం ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు కలిసి ఇల్లు అద్దెకు కావాలంటూ ఈ దంపతుల వద్దకు వచ్చారు. తమకు ఇల్లు ఎంతో నచ్చిందని చెప్పారు.
అద్దె మాట్లాడిన తర్వాత కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చి వెళ్లారు. తిరిగి ఇద్దరు మహిళలు మంగళవారం రాత్రి ఆ ఇంటికి వచ్చారు. ‘రేపటి నుంచి ఇక్కడే ఉంటాం’ అని చెప్పి రాత్రి వెంకటరమణ దంపతుల వద్దే భోజనం చేశారు. బాగా రాత్రి అయ్యాక దంపతుల కళ్లలో కారం కొట్టి వారిని దారుణంగా హత్య చేసి పారిపోయారు. మరుసటి రోజైన బుధవారం వెంకటరమణ కుమార్తె తన తండ్రికి ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అదే ఇంట్లో మరో గదిలో అద్దెకు ఉంటున్న మరో కుటుంబం వారికి ఫోన్ చేసింది. ‘మా నాన్న ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. ఒకసారి వెళ్లి చూడండి.’ అని చెప్పింది. దీంతో వారు వెళ్లి ఆ దంపతుల గదిని చూశారు. గదికి తాళం వేసి ఉండడాన్ని, చూట్టూ కారం చల్లినట్లు ఆనవాళ్లు కనిపించడాన్ని గమనించి వెంటనే కూతురుకు చెప్పారు. తర్వాత పోలీసులకు కూడా సమాచారం చేరవేశారు.
సీఐ సంజీవ్, ఎస్సై సంతోశ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. వృద్ధ దంపతులది హత్యే అని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి క్లూస్ టీంతో కలిసి ఇంటి పరిసర ప్రాంతాలతోపాటు సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. వెంకటరమణ కుమారుడు నరేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఇంటి అద్దె కోసం వచ్చిన మహిళలే హత్య చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే నిందితులను గుర్తించి పట్టుకుంటామని తెలిపారు.