భద్రాచలం/ఇల్లెందు/ముదిగొండ/మణుగూరు టౌన్, జూలై 4 : జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బయలుదేరిన బీఆర్ఎస్వీ, డీవైఎఫ్ఐ నాయకులను పోలీసులు గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసి ఆయా పోలీస్స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా భద్రాచలం, ఇల్లెందు, ముదిగొండ, మణుగూరు పోలీసుల అదుపులో ఉన్న బీఆర్ఎస్వీ, డీవైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు స్వచ్ఛందంగా, చట్టబద్ధంగా తమ హక్కుల కోసం, ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం పోరాటం చేస్తుంటే అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నోటిఫికేషన్లు వేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.
భద్రాచలంలో బీఆర్ఎస్వీ నాయకులు కీసరి యువరాజు, షేక్ రోహిత్పాషా, మేడి రవికుమార్, ముదిగొండలో డీవైఎఫ్ఐ నాయకులు మెట్టెల సతీశ్, భట్టు రాజు, లక్ష్మణ్‌రావు, ఇల్లెందులో బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ యువజన నాయకులు గిన్నారపు రాజేశ్, కాసాని హరిప్రసాద్, సత్తాల హరికృష్ణలను పోలీసులు అరెస్టు చేసి ఆయా పోలీస్స్టేషన్లకు తరలించారు. కాగా.. చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వెళ్తున్న బీఆర్ఎస్వీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ తీవ్రంగా ఖండించారు.