ఖమ్మం, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లాకు కరువు పీడను వదిలించేందుకే గోదావరిపై సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించామని, ప్రాజెక్టు ఉభయ జిల్లాల ప్రజలకు వరదాయిని అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘శ్వేతపత్రం’పై కౌంటర్‌గా ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ‘స్వేదపత్రం’ విడుదల చేసి మాట్లాడారు. ప్రసంగంలో భాగంగా ఆయన తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్ట్‌లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఖర్చు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ ప్రసంగంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సీతారామ ప్రాజెక్ట్, ఖమ్మం ఐటీ హబ్, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ గురించి కూడా ప్రస్తావించారు. రెండు జిల్లాకేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చిన వైద్యకళాశాలల ప్రాధాన్యతను వివరించారు. దీంతో స్వేదపత్రంపై ఉమ్మడి జిల్లా ప్రజలూ ఆసక్తి కనబరిచారు. సీతారామ ప్రాజెక్ట్ కోసం రూ.80 వేల కోట్లు ఖర్చుచేశామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
కేటీఆర్ స్వేదపత్రం విడుదల చేస్తున్న విషయాన్ని ప్రచార సాధనాల ద్వారా తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, నాయకులు, అభిమానులు, ఉమ్మడి జిల్లాలకు చెందిన రైతులు, సాధారణ ప్రజలూ ఉదయం 11 గంటల నుంచే టీవీలకు హత్తుకుపోయారు. కేటీఆర్ ప్రసంగ పాఠాన్ని ఆసక్తిగా గమనించారు. స్వేదపత్రంలో ఉభయ జిల్లాలకు సంబంధించిన అంశాలు ప్రస్తావించినప్పుడు వారు సంతృప్తి వ్యక్తం చేశారు. సాగునీటి రంగం, ప్రాజెక్టులు, రైతు సంక్షేమ పథకాల అమలుపై హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగంపై ప్రసంగిస్తున్నప్పుడు వారు కరెంట్ కోతలు లేనిది ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలోనేనని వ్యాఖ్యానించడం గమనార్హం.
సీతారామప్రాజెక్టు జిల్లా వరదాయిని. నాటి సీఎం కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న చొరవ అభినందనీయం. జిల్లా రైతులు ఎక్కువగా కృష్ణా జలాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తారు. సాగర్ ఎడమ కాలువే సాగుకు ఆధారం. తలాపున గోదావరి ప్రవహిస్తునప్పటికీ ఆ జలాలు ఇప్పటివరకు సాగుకు అందలేదు. ఇలాంటి సందర్భంలో గత ప్రభుత్వం గోదావరి జలాలను జిల్లాలో పారించేందుకు సీతారామ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ప్రాజెక్ట్ పూర్తి చేయిస్తే జిల్లాలో సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుంది.
– నారపాటి రమేశ్, రైతు, ఏదులాపురం, ఖమ్మం రూరల్, ఖమ్మం జిల్లా
గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత లో వోల్టేజీ సమస్యను అధిగమించేందుకు కొత్త సబ్ స్టేషన్లను సైతం నిర్మించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరంలో విద్యుత్ లైన్ల మరమ్మతు, నూతన లైన్ల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల కొరత లేకుండా చర్యలు చేపట్టారు. రెండో ఫేజ్‌తో ఉన్న గిరిజన గ్రామాలకు మూడో ఫేజ్ లైన్ వేశారు. నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్ పథకాలను అందిందించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగు, వ్యవసాయరంగానికి ప్రాధాన్యమిచ్చింది. దీంతో జిల్లాలో గణనీయంగా సాగు విస్తీర్ణం పెరిగింది. రానున్న రోజుల్లో సాగు విస్తీర్ణం మరింత పెరగాలనే ఉద్దేశంతో సీఎంగా నాడు కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు పనులు పూర్తయితే గోదావరి జలాలు, పాలేరు రిజర్వాయర్‌కు నీరు రానున్నది. తద్వారా పాలేరు ప్రాంతంలో సస్యశ్యామలం కానున్నది. రైతులకు ఇక సాగునీటి కొరత ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సీతారామప్రాజెక్టుపై దృష్టి సారించి సత్వరం పూర్తి చేయాలని రైతుల తరఫున కోరుతున్నాం.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు రైతులను ఆదుకున్నాయి. చరిత్రలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా రైతుల కోసం సంక్షేమ పథకాలు అమలయ్యాయి. రైతుబంధు పథకంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే బాధతప్పింది. రైతుబీమాతో రైతు మృతిచెందిన కుటుంబాలకు పరిహారం అందింది. నూతన ప్రభుత్వమూ ఇలా రైతులకు మేలు చేసే పథకాలు అమలు చేస్తే బాగుంటుంది.
విద్యుత్ రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కార్‌పై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, నిజానికి తెలంగాణ వచ్చిన తర్వాతే విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తి రంగాలు పుంజుకున్నాయన్నారు. గతంలో 7 వేల పైచిలుకు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉండగా కేసీఆర్ ప్రభుత్వం దానిని 12 వేల పైచిలుకు మెగావాట్లకు పెంచిందన్నారు. దీనిలో భాగంగా భద్రాద్రి జిల్లా పరిధిలోని మణుగూరు సమీపంలో 1,080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) నిర్మించామని విద్యుత్ స్వేదపత్రంలో వివరించారు. కొత్తగూడెం, ఖమ్మంలో అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని, వైద్యులు కావాలనుకునే పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువతీ యువకుల కల నెరవేరుతుందని కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా భద్రాద్రి జిల్లా వంటి ఏజెన్సీ జిల్లాకు వైద్య, నర్సింగ్ కళాశాలలు రావడాన్ని ప్రజలు హర్షించారన్నారు. ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌తో వందలాది మంది యువత ఉన్నతమైన కొలువులు సాధించారన్నారు.