“ఖమ్మం జిల్లాలో రౌడీరాజ్యం నడుస్తున్నదని, జిల్లాలో ఉన్న ముగ్గురు మోసగాళ్లు 30 శాతం చొప్పున కమీషన్లు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. బాంబులేటి మంత్రికి 30 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనన్నారు.. ఏ భూమి ఆయన దగ్గరికి వెళ్లిన 30 శాతం ఇవ్వాలని అడుగుతున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే పనిలో ఉన్నాడన్నారు. ముగ్గురు మంత్రుల్లో ఏ ఒకరు కూడా జిల్లాకు పనికొచ్చే పని చేయడంలేదన్నారు. వీరికి అసలైన నాయకుడు ఆలీబాబా పైన ఉన్నాడని సీఎం రేవంత్‌నుద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శించారు.”
“మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లుభట్టి విక్రమార్క ఆనాడు సీఎల్పీ లీడర్‌గా ఉన్న సమయంలో గ్యారెంటీ కార్డులను చేతిలో పట్టుకొని వీటిని భద్రంగా దాచుకోండి, భద్రంగా పెట్టుకోండి అన్నారు.. మా పార్టీ అధికారంలోకి రాగానే నూరు రోజుల్లో మహిళలకు రెండున్నర వేలు, వృద్ధులకు రూ.4 వేల పింఛన్, తులం బంగారం, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. మరీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఎందుకు ఆ 420 హామీలు అమలు చేయలేదు.. ఇప్పుడు ఆ గ్యారెంటీ కార్డు ఎకడ పెట్టుకోవాలి అని భట్టిని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ హామీలన్నీ ఎకడికెళ్లాయని, సూటీలు ఏమయ్యాయని, లక్ష కోట్ల బడ్జెట్ ఏమైందని ఎద్దేవా చేశారు.. కాంగ్రెస్‌ది సర్వభ్రష్ట ప్రభుత్వమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.”

ఖమ్మం, జనవరి 7: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే గొప్ప సదుద్దేశంతో ‘సీతారామ’ ఎత్తిపోతల పథకాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా డిజైన్ చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బుధవారం ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం (తెలంగాణ భవన్)లో పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచ్, ఉపసర్పంచులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి కేటీఆర్ మాట్లాడుతూ ఏనుగు వెళ్లింది.. తోక చికింది అన్నట్లు 90 శాతం పనులు కేసీఆర్ పూర్తి చేశారని, 2023 డిసెంబర్ రెండో తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి కట్టిన ఇల్లు, పెట్టిన పోయి మాదిరిగా వారి చేతికి తాళాలు ఇచ్చి తప్పుకున్నామని తెలిపారు. అయినా ఈ రెండేళ్లలో వారు ఏం చేశారని ప్రశ్నించారు.
సీతారామ ప్రాజెక్టు ద్వారా అశ్వారావుపేట నియోజకవర్గంలో లక్షన్నర ఎకరాలు, సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాలకు 40 వేల ఎకరాలు, ఇల్లెందులో 20 వేల ఎకరాలు, కొత్తగూడెంలో 10 వేల ఎకరాలు, వైరాలో 20 వేల ఎకరాలకు నీళ్లు వచ్చేలా కేసీఆర్ డిజైన్ చేశారన్నారు. కానీ, ఇల్లెందుకు నీళ్లు రాకుండా కాంగ్రెస్ పెద్దలు చేశారన్నారు. ఈ రెండేళ్లలో జిల్లాలో ఒక్కపని కూడా ముందుకు జరగకపోగా.. ముగ్గురు మంత్రులు కమీషన్ల కోసమే పని చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మీ రవిని నిజంగా అభినందిస్తున్నానని, తమ్ముడి మీద పొంగులేటి కేసులు పెట్టి జైలుకు పంపాలని ప్రయత్నం చేశాడని, ఎన్నో నిర్బంధాలను ఎదురొని 135 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలిచాడని అన్నారు.
అనేక మేజర్ గ్రామపంచాయతీలను బీఆర్ఎస్ గెలిచిందన్నారు. పాలేరు, సత్తుపల్లిలో ఎకువ స్థానాలు గెలుచుకున్నామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ స్థానాలను గెలుచుకునేలా కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఖమ్మం జిల్లాలో రౌడీరాజ్యం నడుస్తుందని, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని సర్పంచులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ భరోసానిచ్చారు. మా దగ్గరికి రాకపోతే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వమని, బిల్లులు మంజూరు చేయమని అంటున్నారని, ఎవరి అవసరం లేదని గెలిచిన సర్పంచులకు రక్షణగా ఉండేది డాక్టర్ బీఆర్ అంబేదర్ రాసిన రాజ్యాంగమేనని అన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో.. గ్రామ పంచాయతీకి సర్పంచ్ అంతేనని అన్నారు.
ఏ ఒకరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులు నేరుగా పంచాయతీ ఖాతాల్లోనే జమవుతాయన్నారు. వీటిలో 85 శాతం నిధులు పంచాయతీకి చెందుతాయని, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫైనాన్స్ కమిషన్ ఎన్ని డబ్బులు ఇస్తే కేసీఆర్ మళ్లీ అన్ని డబ్బులు ఇచ్చారని గుర్తుచేశారు. అందుకనే దేశంలోనే ఉత్తమ పంచాయతీలు తెలంగాణలోనే ఉన్నాయని ఆనాడు కేంద్ర ప్రభుత్వమే తేల్చి చెప్పిందన్నారు. ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్, డంపింగ్ యార్డు, ప్రకృతివనం, వైకుంఠధామం, క్రీడాప్రాంగణం, ప్రతి ఇంటికి నల్లా లాంటి ఎన్నో పనులను చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. అద్భుతమైన నాయకత్వం ఖమ్మం జిల్లాలో ఉందని, అందరూ ఐక్యంగా పనిచేస్తే పదికి పది స్థానాలు గెలుస్తామన్నారు.
ఈ ఏడాదంతా ఒకవైపు ప్రజా ఆందోళనలు నిర్వహిస్తూనే పార్టీ నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఉంటాయని, గ్రామ, మండల, జిల్లా కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్రెడి,్డ మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, చంద్రావతి, బానోత్ మంజుల, ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఉద్యమకారులు న్యాయవాది జేఏసీ చైర్మన్ బిచ్చాల తిరుమలరావు, సీనియర్ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు ఖమర్, దిండిగాల రాజేందర్, ఖమ్మం మారెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష,్ణ డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ కర్నాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ది సర్వభ్రష్ట ప్రభుత్వం
ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన సర్పంచుల అభినందన సభలో ప్రసంగిస్తున్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వేదికపై ఎంపీ వద్దిరాజు, మాజీ మంతి మాజీ ఎంపీ నామా, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర, కందాల, రేగా, వనమా, హరిప్రియ తదితరులు
ముగ్గురు మంత్రులున్నా వేస్ట్..

ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా గోదావరి జలాలను ఈ జిల్లాకు తేలేకపోయారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. గోదావరి జలాలను ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు తెస్తామన్న ఎన్నికల హామీ ఏమైందని ప్రశ్నించారు. కొత్త ఆయకట్టుతోపాటు కనీసం పాత ఆయకట్టులోనూ చుకనీటిని పారించలేకపోయారని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ నిర్బంధాలు, కేసులు, ప్రలోభాలు, ఒత్తిళ్లను తట్టుకొని గెలిచిన సర్పంచ్‌లకు, ఉప సర్పంచ్‌లకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఉద్యమ సమయం నాటి స్ఫూర్తితో ఈ మూడేళ్లు కూడా శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని; కేసీఆర్, కేటీఆర్‌లే సీఎంలు అవుతారని స్పష్టం చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరికీ గుర్తింపునిచ్చిందని గుర్తుచేశారు.
కానీ, కష్టకాలంలో పార్టీని వదిలిపోవడం అనైతిక చర్య అని అభివర్ణించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక తన పదేళ్ల పాలనలో వాటిని సాధించి చూపారని వివరించారు. సీతారామ ప్రాజెక్టును అప్పటి సీఎం కేసీఆరే 85 శాతం పూర్తిచేశారని గుర్తుచేశారు. కానీ, రూ.19 వేల కోట్లకు అంచనాలను పెంచిన నేటి కాంగ్రెస్ పాలకులు.. తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. పైగా, కేసీఆర్ పాలనలో బిగించిన మోటార్లకు స్విచ్ ఆన్ చేసి.. దానిని తాము నిర్మించినట్లుగా గొప్పలు చెప్పుకోవడం, గోదారి నీళ్లను నెత్తిన చల్లుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ఉద్యమం తర్వాత ఖమ్మం జిల్లా నుంచి సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం మరో ఉద్యమం ప్రారంభమవుతుందని తెలిపారు. పోరాట పటిమ కలిగిన నాయకత్వం కాంగ్రెస్‌లో లేకపోవడం వల్లే బీఆర్ఎస్ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేసి ఆ పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. అయినప్పటికీ కార్యకర్తలను, నాయకత్వాన్ని తయారు చేసే సత్తా బీఆర్ఎస్కు ఉందని తేల్చిచెప్పారు.
కాబోయే సీఎం కేటీఆరే..
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరేనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నాయకులు కొబ్బరికాయలు కొట్టడం మినహా చేసిందేమీ లేదని విమర్శించారు. కేటీఆర్ ఖమ్మం వస్తున్నారనే విషయం తెలిసి 8 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ఆ పార్టీ నేతల చిల్లరతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. అభివృద్ధిని మానేసి పక పార్టీ వాళ్ల ఇళ్ల వెంట తిరగడం మంత్రి తుమ్మలకు తగదని హితవుచెప్పారు.
సీతారామ ప్రాజెక్టు నుంచి ఇల్లెందు నియోజకవర్గాన్ని తప్పించి బయ్యారం, గార్ల, ఇల్లెందు, డోర్నకల్ తదితర ప్రాంతాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. ఉచిత హామీలు, మోసపు మాటలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. బీసీ బిడ్డనైన తనను రెండుసార్లు రాజ్యసభకు పంపిన మహోన్నతుడు కేసీఆర్ అని గుర్తుచేశారు. కాంగ్రెస్ నిర్బంధాలను ఎదురొని ఏ విధంగానైతే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు స్థానాలను గెలుచుకున్నామో అదే స్ఫూర్తితో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని, జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ఉపయోగంలేదని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో ముందంజలో ఉందని గుర్తుచేశారు. తన పాతికేళ్ల రాజకీయ జీవితంలో కేటీఆర్‌కు ఉన్న అభిమానులను మరే నాయకుడికీ చూడలేదని పేర్కొన్నారు. చంకలో పిల్లలను ఎత్తుకొని మరీ కేటీఆర్‌ను పలుకరించేందుకు మాతృమూర్తులు ఎదురుచూడడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలోనే గ్రామాలకు గుర్తింపు వచ్చిందని గుర్తుచేశారు.
రానున్న ఎన్నికల్లో సత్తా చాటుదాం..
పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాల స్ఫూర్తితో రానున్న పురపాలక, ప్రాదేశిక ఎన్నికల్లోనూ సత్తా చాటుదామని మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, బానోతు హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు తదితరులు పిలుపునిచ్చారు. అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని పార్టీని విజయ తీరాలకు చేర్చామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో పంచాయతీ ఎన్నికలు స్పష్టం చేశాయని గుర్తుచేశారు. బీఆర్ఎస్ శ్రేణులపైనా, ప్రజాప్రతినిధులపైనా అధికార పార్టీ ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా జరిగిన పంచాయతీల్లోనే బీఆర్ఎస్ మద్దతుతో పోటీలో నిలిచిన సర్పంచ్‌లు అత్యధిక స్థానాల్లో గెలవడంతో.. ఇప్పుడు పార్టీ గుర్తులపై జరిగే పురపాలక, ప్రాదేశిక ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితి ఏంటని భయం కాంగ్రెస్ నాయకులకు పట్టుకుందని స్పష్టం చేశారు.
