రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ప్రజాపాలన పేరు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలకులు.. కర్షకులపై కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. లగచర్ల రైతులు ఏం తప్పు చేశారని నెల రోజులుగా బెయిల్ ఇవ్వకుండా వారిని జైల్లోనే ఉంచి చిత్రహింసలు పెడుతున్నారని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుటుంబం కోసం చేస్తున్న భూసేకరణను అడ్డుకున్నందుకు, ఆయన సోదరులకు భూములు ఇవ్వనందుకే గిరిజన రైతులపై తప్పుడు కేసులు బనాయించారా?’ అంటూ నిలదీశారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని మార్చుకోకపోతే బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో స్పందిస్తుందని స్పష్టం చేశారు.
గిరిజన రైతుల పక్షాన ఉద్యమించి కాంగ్రెస్ మెడలు వంచుతుందని హెచ్చరించారు. లగచర్ల రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని, వారిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు శ్రీకారం చుట్టాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు మంగళవారం స్పందించాయి. పార్టీ ఆదేశం మేరకు వాడవాడలా ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించాయి.
ఈ సందర్భంగా మణుగూరు, ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, మధిర నియోజకవర్గాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు తదితరులు మాట్లాడారు. ‘ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన అంటే గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లడమా?’ అని ప్రశ్నించారు. ‘లగచర్ల రైతులేమైనా గజదొంగలా?’ అంటూ నిలదీశారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి సంకెళ్లు వేయడం.. కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని దుయ్యబట్టారు. తమ కుటుంబానికి భూములివ్వబోమన్న లగచర్ల రైతులను జైలుకు పంపిన సీఎం రేవంత్రెడ్డి.. అక్కడ రైతుల థర్డ్ డిగ్రీని వీడియో కాల్లో చూస్తూ రాక్షసానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. లగచర్ల రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకూ వారి తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. వారికి అండగా ఉంటుందని తేల్చిచెప్పారు. కాగా, అశ్వారావుపేటలో కొందరు బీఆర్ఎస్ నేతలు చేతులకు బేడీలతో నిరసన వ్యక్తం చేశారు.
-నమస్తే నెట్వర్క్, డిసెంబర్ 17