ఖమ్మం రూరల్: నాలుగు రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈనెల 14న రెండో విడతలో భాగంగా ఖమ్మం రూరల్ (Khammam Rural) మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే మండలంలోని ఎక్కువ జనాభా కలిగిన ఎం వెంకటయ్య పాలెం, తల్లంపాడు గ్రామాల్లో ఉప సర్పంచ్ల (Deputy Sarpanch) ఎన్నిక ప్రక్రియ ఆగిపోయింది. తల్లంపాడులో బీఆర్ఎస్ (BRS) కూటమి 12 స్థానాలకుగాను ఏడు స్థానాలలో విజయం సాధించినప్పటికీ అధికార పార్టీ, కొందరు అధికారుల కుయుక్తుల వల్ల ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా పడుదూ వచ్చింది. కూటమి తరపున గెలిచిన వార్డు మెంబర్లను తమ వైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ నేతలు అనేక ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడ్డారు. అయినప్పటికీ కూటమినేతల సమన్వయం ఫలించడంతో ఎట్టకేలకు బీఆర్ఎస్కి ఉప సర్పంచ్ పదవి దక్కింది.
గ్రామంలోని 11వ వార్డు మెంబర్‌గా బీఆర్ఎస్ బలపరిచిన సీపీఎం అభ్యర్థి గుడిబోయిన అరవింద్‌ను కూటమి వార్డు సభ్యులు ఉప సర్పంచ్‌గా ఎన్నుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల్లో ఆనందం వెళ్లివేరిసింది. గ్రామంలో పెద్ద ఎత్తున పటాకులు కాల్చి కూటమి నేతలు సంబురాలు జరుపుకున్నారు. అదేవిధంగా మండలంలో అత్యధిక ఓటర్లు కలిగిన ఎం వెంకటయ్య పాలెంలో సీపీఎం బలపరిచిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన 9వ వార్డు అభ్యర్థి కోళ్లపూడి సుమతి ఉప సర్పంచ్‌గా ఎన్నిక కావడంతో మండలంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ కార్యక్రమాలలో బీఆర్ఎస్ నేతలు గుడిబోయిన దర్గయ్య, శంకర్ రాజ్, నరేందర్, రామగిరి వెంకన్న, ఉపేందర్, మట్ట వెంకటేశ్వరరావు, సతీష్, భార్గవ్, సీపీఎం నేతలు బండి రమేష్, నంద ప్రసాద్, తుమ్మల సురేష్, వేగనాటి విజయ్‌తో పాటు ఇరుపార్టీల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రెండు ప్రధాన గ్రామాలలో బీఆర్ఎస్ కూటమి అభ్యర్థులు ఉప సర్పంచ్‌గా ఎంపిక కావడంతో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రూరల్ ప్రెసిడెంట్ బెల్లం వేణుగోపాల్, సీపీఎం మండల కార్యదర్శి ఊరెడి సుదర్శన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.