ఖమ్మం, మార్చి 7 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం స్థానాన్ని బీఆర్ఎస్సే కైవసం చేసుకుంటుందని బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్యక్షతన గురువారం ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో నిర్వహించిన పార్టీ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గస్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం ఉందన్నారు. జిల్లా ప్రజలు తనను రెండుసార్లు ఎంపీగా గెలిపించి పార్లమెంట్‌కు పంపారని, వారిపై ప్రేమతో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపానన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను లోక్‌సభలో గొంతెత్తానన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తిరిగి సాగునీరు, విద్యుత్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, కానీ ఆయనకు మాత్రం పార్టీ ఏమీ ఇవ్వలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావును గెలిపించుకుని కేసీఆర్‌కు కానుక ఇద్దామన్నారు. నామాకు అత్యంత ప్రజాదరణ ఉందన్నారు. ఆయన సత్తా ఉన్న నాయకుడని కొనియాడారు. ఢిల్లీలో ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ ఎంపీలందరూ ముందుకు సాగుతున్నారన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఉద్యమ నేతగా కేసీఆర్ ప్రాణాలు ఒడ్డి తెలంగాణ సాధించారన్నారు.
అనంతరం ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నంబర్‌వన్ చేశారని కొనియాడారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను కష్టాలు పాలు చేయడం ప్రారంభించిందని మండిపడ్డారు. రైతుబంధు గురించి ముగ్గురు మంత్రులు మూడు విధాలుగా మాట్లాడుతున్నారన్నారు. మూడెకరాలు దాటిన రైతులకు ఇప్పటివరకు రైతుబంధు అందలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు, కేసులు నమోదు చేయడం మానుకోవాలని అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నామా గెలుపు అత్యంత ఆవశ్యకమన్నారు. కార్యకర్తలందరూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలన్నారు. బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. నిజాయితీకి, నిబద్ధతకు నిలువటద్దం నామా నాగేశ్వరరావు అని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. నామాకు అత్యధిక మెజార్టీ ఓట్లు వచ్చేలా కార్యకర్తలు, నాయకులు పని చేయాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలకొన్న సమస్యలపై నామా లోక్‌సభలో ప్రస్తావించారని గుర్తుచేశారు. నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రిగా కేటీఆర్ ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో నామాను గెలిపించుకుని, ఆ గెలుపును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. నామా గెలుపుతో జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు రావాలన్నారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సైనికుల్లా పనిచేద్దామన్నారు.
మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉండే నామాకు అండగా నిలుద్దామని, పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తొలుత నగరంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం గులాబీ శ్రేణులు పట్టణంలో ద్విచక్రవాహనాలు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించాయి. తొలుత పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఎమ్మెల్యే లాస్య నందితను స్మరిస్తూ కొద్దిసేపు మౌనం పాటించారు. బీఆర్ఎస్ ఉద్యమకారుడు బొమ్మెర రామ్మూర్తిని వేదికపై ఆహ్వానించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, బానోతు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు కొండబాల కోటేశ్వరరావు, చంద్రావతి, కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్‌కుమార్, మొండితోక జయకర్, ఖమర్, షౌకత్ ఆలీ, బిచ్చాల తిరుమలరావు, పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణ, ఉప్పల వెంకటరమణ, డోకుపర్తి సుబ్బారావు, మహేశ్, చింతనిప్పు కృష్ణచైతన్య, మాటేటి కిరణ్, జోగేశ్వరరావు, నాగమణి, కోనేరు చిన్ని, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు పాల్గొన్నారు.