రామవరం, జూలై 16: సింగరేణి బొగ్గు గని కార్మికులకు ఏ కష్టమొచ్చినా అండగా నిలబడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నాయకులతో కేటీఆర్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం బీఆర్ఎస్కు అనుబంధంగా అనేక కార్యక్రమాలు చేపట్టాలని, ఈ దిశగా సింగరేణి ప్రాంతంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు, మాజీ మంత్రులను సమన్వయం చేసుకోవాలని చెప్పారు.
టీబీజీకేఎస్ కోసం బీఆర్ఎస్ తరఫున ఇన్చార్జిగా ఇక నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యవహరిస్తారని తెలిపారు. టీబీజీకేఎస్‌కు పూర్తిస్థాయిలో పార్టీ మద్దతు, సహకారం ఉంటుందన్నారు. కార్మికుల కోసం పార్టీ లీగల్ సెల్ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేసినా చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు సహకారం అందిస్తుందన్నారు.
త్వరలోనే సింగరేణి ప్రాంతంలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని కేటీఆర్ తెలిపారు. సమావేశంలో టీబీజీకేఎస్ నేతలు మిర్యాల రాజిరెడ్డి, కాపు కృష్ణ, సురేందర్‌రెడ్డి, మాదాసు రామ్మూర్తి, కొమరయ్య, పార్లపల్లి రవి, వడ్డేపల్లి శంకర్, ఐలి శ్రీనివాస్, నాగెల్లి సాంబయ్య, బండి రమేశ్, మేడిపల్లి సంపత్, బడితల సమ్మయ్య, నాగెల్లి వెంకటేశ్వర్లు, గడప రాజయ్య, తుమ్మ శ్రీనివాస్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.