రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను దోచుకోవాలని చూస్తే ఊర్కునేది లేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం, సత్తుపల్లి, ఇల్లెందులోని జీఎం కార్యాలయాలను బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం శ్రేణులు ముట్టడించాయి. సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వ జోక్యం తగ్గించుకోవాలని, సైట్ విజిట్ విధానంతో పిలిచిన టెండర్లన్నింటినీ రద్దు చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు.
కొత్తగూడెం సింగరేణి/ సత్తుపల్లి టౌన్/ ఇల్లెందు, జనవరి 21: భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీస్ ఎదుట జరిగిన ధర్నాలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పినపాక మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మరొక మంత్రి కలిసి సింగరేణిలో సైట్ విజిట్ విధానాన్ని ప్రవేశపెట్టి తమ బంధువులు, శ్రేయోభిలాషులకు సింగరేణి సొమ్మును దోచిపెట్టేందుకు తెర లేపారని విమర్శించారు. సైట్ విజిట్ విధానంతో తమ అనుయాయులకు అడ్వాన్స్‌గా టెండర్లను ఇవ్వాలనే దురాలోచనతో ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు.
సింగరేణి సంస్థను ప్రైవేట్‌పరం కాకుండా కేసీఆర్ ప్రభుత్వం కాపాడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లకే సింగరేణి సొమ్మును ప్రభుత్వ సోకులకు ఏటీఎంగా ఉపయోగించుకుంటున్నదని విమర్శించారు. సైట్ విజిట్ విధానం కొంతమంది కాంట్రాక్టర్లకు మాత్రమే ఉపయోగపడుతుందని, ఆ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి నైనీ బ్లాక్‌తోపాటు మిగిలిన ఏడు బ్లాకులకు కూడా మళ్లీ రీ టెండర్ పెట్టాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో అక్రమ టెండర్ల విషయమై ప్రశ్నించిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును సిట్ పేరుతో ఇబ్బందులకు గురిచేసి డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
సింగరేణిలో 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం సైట్ విజిట్ విధానాన్ని ఎలా అంగీకరించిందని, దీనిపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణిలో మాత్రమే ప్రవేశపెట్టిన సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేసి సీబీఐచే విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు మరో పోరాటం తప్పదని హెచ్చరించారు.
అనంతరం సింగరేణి అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రధాన కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే భారీ ఎత్తున మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హెడ్డాఫీస్ ఎదుట ఉన్న సింగరేణి తల్లికి టీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ వినతిపత్రం సమర్పించి.. సింగరేణిని నీవే కాపాడుకోవాలి తల్లి అని ప్రాథేయపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, సత్తుపల్లి, చండ్రుగొండ, మణుగూరు ఏరియాల టీబీజీకేఎస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్ నాయకులు తుమ్మ శ్రీనివాస్, ఏరియా ఉపాధ్యక్షుడు గడప రాజయ్య, మణుగూరు వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి వెంకటేశ్వర్లు, సత్తుపల్లి నుంచి కే.ఆంజనేయులు, కరాటే శ్రీను, మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, బదావత్ శాంతి, అన్వర్‌పాషా, మజీద్, రాజుగౌడ్, బత్తుల శ్రీనివాస్, వెంకి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇల్లెందు పట్టణంలో..
ఇల్లెందు పట్టణంలోని జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట టీబీజీకేఎస్, బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేశారు. టీబీజీకేఎస్ ఇల్లెందు ఏరియా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ జాఫర్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేణిలో జరిగిన అక్రమాలు, దందాలపై సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో సింగరేణి ఉద్యోగులకు స్వర్ణయుగం సాగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే జీతాలు ఇవ్వలేని దుస్థితికి వచ్చిందన్నారు. కార్యక్రమంలో టీజీబీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్.రంగనాథ్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ లక్కినేని సురేందర్‌రావు, మాజీ కౌన్సిలర్లు కటకం పద్మావతి, చీమల సుజాత, తార, బీఆర్ఎస్ నాయకులు భూక్యా దళ్‌సింగ్, పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ జబ్బార్, పరుచూరి వెంకటేశ్వర్లు, అబ్దుల్ నబీ, ఖమ్మంపాటి రేణుక, అజ్మీర బావుసింగ్, లకావత్ దేవీలాల్, లాల్‌సింగ్, నెమలి ధనలక్ష్మి, సర్పంచులు కుంజ సుకనయ్య, యెపె శంకర్, మాజీ సర్పంచ్ తాటి మౌనిక, రవితేజ, కిరణ్, సునిల్, శ్రీకాంత్, లలిత్‌కుమార్ పాసి, చాంద్‌పాషా, రాజేష్, హరిప్రసాద్, సత్యనారాయణ, రవికాంత్ పాల్గొన్నారు.
సత్తుపల్లి జీఎం కార్యాలయం ఎదుట..
సత్తుపల్లిలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి సింగరేణి జీఎం కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, కార్యాలయాన్ని ముట్టడించి అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జీఎం చింతల శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడిందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు, పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో నైనీ బ్లాక్ బొగ్గు గని టెండర్లు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చి తమకు కావాల్సిన కంపెనీలకు లాభం చేకూర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. అధికార కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కుమ్మకై సింగరేణి సంస్థకు అన్యాయం చేస్తున్నాయని, 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అక్రమాలపై ప్రశ్నించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇచ్చారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం దీపావళి బోనస్లకే దికులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంఎఫ్ నిధులు పకదారి పడుతున్నాయని, ఆ నిధులను కలెక్టర్ ఖాతాలో జమ చేసి, పారదర్శకంగా వినియోగించాలని డిమాండ్ చేశారు.
పనులు చేసిన వారికి సమయానికి డబ్బులు చెల్లించి, సింగరేణిలో జరుగుతున్న అక్రమాలకు తక్షణమే చెక్ పెట్టాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సింగరేణి సంస్థలో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సండ్ర డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నదని, సింగరేణిని పరిరక్షించేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని అల్టిమేటం ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ వనమా వాసు, మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపుడి మహేశ్, కోటగిరి సుధాకర్‌బాబు, మాధురి మధు, దొడ్డ శంకర్రావు, అంకమ్మ రాజు, చెకిలాల మోహన్‌రావు, టీవీ రామారావు, కృష్ణ పాల్గొన్నారు.
వడ్డించిన విస్తరిలా సింగరేణి సంస్థ
సింగరేణి సంస్థలో ఉద్యోగం చేసేందుకు పొట్టచేత పట్టుకొని వచ్చిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 136 ఏళ్లుగా సంస్థను కాపాడుకుంటూ వస్తున్నాం. రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సింగరేణి సంస్థ వడ్డించిన విస్తరాకులా మారింది. ఎవరికి దొరికింది వారు దోచుకోవడమే తప్ప సింగరేణి సంస్థను అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. కారుణ్య నియామకాలు కొనసాగించకపోవడం వల్ల యువతకు సింగరేణిలో ఉద్యోగావకాశాలు లేకుండాపోయాయి.
-కంఠాత్మకూర్ ఆంజనేయులు, సత్తుపల్లి ఏరియా కిష్టారం ఓసీ జూనియర్ అసిస్టెంట్
కాంగ్రెస్ పాలనలో దివాలా తీయడం ఖాయం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సింగరేణి సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ కార్మికులకు అన్ని వసతులతోపాటు సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి బాటలో నడిచింది. ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలోనే అనేక అవినీతి, అక్రమాలు జరిగినట్లు ఒక్కొక్కటి వార్తల రూపంలో బయటికి వస్తున్నాయి. ఇవి ఇలానే కొనసాగితే సింగరేణి సంస్థ దివాలా తీయడం ఖాయం. సంస్థను కాపాడుకునే బాధ్యత ఉద్యోగులతోపాటు ప్రజలపై ఉంది.
-తుమ్మ శ్రీనివాస్, కొత్తగూడెం కార్పొరేట్ ఉపాధ్యక్షుడు
సింగరేణిని పీల్చి పిప్పిచేస్తున్న ప్రభుత్వం
సింగరేణి సంస్థలో కొత్త బావులను తీసుకొచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, సింగరేణిని గ్లోబల్ సంస్థగా విస్తరించి కీర్తి ప్రతిష్టలు పెంచుతామన్న కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం ఏర్పడగానే సంస్థను చెద పురుగుల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రుల బంధువుల కోసం ఎక్కడా లేని విధానాన్ని ప్రవేశపెట్టి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తులో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారనున్నది.
-నాగెల్లి వెంకటేశ్వర్లు, మణుగూరు ఏరియా ఉపాధ్యక్షుడు
అప్పులు తెచ్చి జీతాలు చెల్లిస్తున్నారు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ వేల కోట్ల లాభాలను ఆర్జిస్తుంది. దీంతో ఏటా లాభాల వాటా పెంచుతూ వస్తున్న నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణి సంస్థను ఏటీఎంగా వాడుకుంటున్నారు. ప్రస్తుతం కార్మికులకు జీతాలు చెల్లించేందుకు బ్యాంకుల్లో అప్పులు తెచ్చి చెల్లిస్తున్నారు. సింగరేణి సంస్థలో ప్రభుత్వ జోక్యం తగ్గించుకోకుంటే భవిష్యత్తులో మళ్లీ సింగరేణి అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.
-శనిగరపు శంకర్(బోరింగ్ శంకర్), కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షుడు