ఖమ్మం, ఏప్రిల్ 28: వరంగల్‌లో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. పాతికేళ్ల పండుగను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాధాలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీవినీ ఎరుగనిరీతిలో సభ జరిగిందని, ఉమ్మడి జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని పేరొన్నారు. ఎంతగానో ఎదురుచూసిన లక్షలాదిమంది ప్రజలు.. బీఆర్ఎస్ అధినేత, ఉద్యమసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని ఆసాంతం విన్నారని అన్నారు.
ఎండ తీవ్రతను లెక చేయకుండా కాలినడకన కూడా అభిమానులు సభకు చేరుకున్నారని, ప్రైవేట్ యాజమాన్యాల బస్సులు సభకు వెళ్లకుండా రవాణా శాఖ అధికారుల తో ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినా పార్టీ కార్యకర్తలు వాటిని అధిగమించి మరీ సభకు వచ్చారని వివరించారు. ఈ సభను చూసి కాంగ్రెస్ నేతల వెన్నులో వణుకు పుట్టిందని అన్నారు. ఓ మంత్రి తన స్థాయిని మరిచి.. కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించారని అన్నారు. అతడి వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ సభను చూసి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన కాంగ్రెస్ నేతలు.. ఎదురుదాడి చేయడం విచారకరమని అన్నారు.
దసరా రోజున పాలపిట్టను చూసిన ఆనందం.. కేసీఆర్‌ను చూడగానే సభకొచ్చిన ప్రజల ముఖాల్లో కన్పించిందని అన్నారు. కాంగ్రెస్ పాలనకు విసుగు చెందిన ప్రజలు.. సభ అయిపోయే వరకు ఓపికతో ఉన్నారని అన్నారు. ఎన్నికలెప్పుడొచ్చినా బీఆర్ఎస్ గెలుస్తుందనే నమ్మకం ఏర్పడిందని, రాబోయేదిక కేసీఆర్ సర్కారేనని స్పష్టం చేశారు. ఎల్కతుర్తి సభ కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోందని, కాంగ్రెస్ నేతల డైవర్షన్ పాలిటిక్స్‌కు కేసీఆర్ మీటింగ్ చెంపపెట్టులా ఉందని అన్నారు. కేసీఆర్ మీటింగ్ సక్సెస్‌ను తట్టుకోలేక అకసుతోనే మంత్రులు అవాకులుచవాకులు పేలుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్ అనవాళ్లను ఎవరూ చేరిపేయలేరని స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్‌ను వదిలిపెట్టబోమని కేసీఆర్ చెప్పారని, ఆయన ఆదేశాల ప్రకారం ప్రభుత్వంపై పోరాడతామని అన్నారు. సభకు నాలుగు దిక్కులా 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడమే ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటుకు చిహ్నమని స్పష్టం చేశారు. జడ్పీ, డీసీసీబీ మాజీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కూరాకుల నాగభూషణం, మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్, టీఎస్ సీడ్స్ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, పార్టీ నేతలు, ఉద్యమకారులు బెల్లం వేణుగోపాల్, బిచ్చాల తిరుమలరావు, మక్బూల్, గుండ్లపల్లి శేషగిరిరావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.