ఖమ్మం సిటీ, మే 9: తెలంగాణలో అధికారం వెలగబెడుతున్న కాంగ్రెస్‌ది ‘కోత’ల ప్రభుత్వమని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ విమర్శించారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. తన సిఫార్సుతో 92 మందికి మంజూరైన చెక్కులను సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజుతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి వర్గాలకు ఎంతోకొంత ఆసరాగా నిలవాల్సిన సీఎంఆర్ఎఫ్ నిధుల్లో భారీగా కోతలు విధించిన ఏకైక సర్కార్ కాంగ్రెస్సేనని ధ్వజమెత్తారు. ఎవరు ఎన్ని రూ.లక్షలకు దరఖాస్తు చేసుకునప్పటికీ కేవలం రూ.30 వేల నుంచి రూ.60 వేలకు మించి మంజూరు చేయడం లేదని అన్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదింటి పెద్దకొడుకు మాదిరిగా సీఎంఆర్ఎఫ్ పథకానికి దరఖాస్తులు చేసుకున్న వారందరికీ సంపూర్ణ న్యాయం చేశారని గుర్తుచేశారు. ఆనాడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి చెక్కులు అందించారని జ్ఞప్తికి తెచ్చారు.
రైతులు అరిగోస పడుతున్నరు..
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయం పండుగలా మారిందని ఎమ్మెల్సీ తాతా మధు గుర్తుకు తెచ్చారు. సమయానికి విత్తనాలు, ఎరువులు, పంటల పెట్టుబడి సాయం (రైతుబంధు) అందించారని అన్నారు. అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారన్నారు. దాంతో అన్నదాతల కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యేవన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతోందని విమర్శించారు. సకాలంలో ఎరువులు అందించే పరిస్థితి లేదని; కష్టనష్టాలకోర్చి పంటలను పండిస్తే వాటిని కొనుగోలు చేసే దిక్కులేదని విమర్శించారు.
కండ్ల ముందే ఆరుగాలం కష్టించి పండించిన పంటలు ఆగమవుతుంటే కర్షకులు గుండె పగిలి రోదిస్తున్నారని, మృత్యువాత పడుతున్నారని వ్యాఖ్యానించారు. రైతుల ఉసురు పోసుకున్న ప్రభుత్వాలు మనుగడ సాగించిన చరిత్ర దేశంలోనే లేదని, త్వరలోనే కాంగ్రెస్ భూస్థాపితం కావడం ఖాయమని అన్నారు. తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష అని, మరో రెండేళ్లు ఓపిక పడితే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు బెల్లం వేణు, పగడాల నాగరాజు, ముత్యాల వెంకటప్పారావు, పోట్ల ప్రసాద్, మహ్మద్ రఫీ, పేరం వెంకటేశ్వర్లు, బలుసు మురళీకృష్ణ, లింగనబోయిన సతీశ్, వడ్డెల్లి లెనిన్చౌదరి, గూడ సంజీవరెడ్డి, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.