‘నోటీసు ఇవ్వకుండా ఇల్లు కూల్చుతారా?’ అని ఓ టీవీ యాంకర్ అడిగితే, ‘ఎస్.. కూల్చేయవచ్చు’ అని హైడ్రా బాస్ రంగనాథ్ అన్నప్పుడే జాగ్రత్త పడాల్సింది. ‘ఎమ్మార్వో చెప్తే చార్మినార్ కూడా నేలమట్టం చేస్తారా?’ అని జడ్జి నిలదీసినపుడే అర్థం కావలసింది. ఇప్పుడు కోర్టు ‘ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించండి’ అని తేల్చిచెప్పింది. రెండేండ్లుగా సాగుతున్న కోర్టు బేఖాతరు, వరుస కూల్చివేతలతో రాష్ట్రంలో హైడ్రా ఓ అతీతశక్తిగా మారిపోయింది. అయినా ప్రభుత్వానికి కనువిప్పు కలుగడం లేదు. ‘హైడ్రా ఆగదు, కమిషనర్ మారడు’ అని సీఎం రేవంత్‌రెడ్డి పంతానికే వెళ్తున్నారు. ఇలా కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారిని వెనకేసుకు రావడమేంటి?
హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివాదాస్పదుడిగా మిగిలారు. అంతా ప్రభుత్వం చూసుకుంటుంది అనుకోకుండా ఆయన సొంత ప్రచారానికి ఒడిగట్టారు. ఆయన చెరువులు కాపాడామంటూ అతిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇండ్ల కూల్చివేతను తేలిగ్గా తీసుకుంటున్నారు. తాను రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నానడంలో అర్థమే లేదు. అదే నిజమైతే కోర్టుకు రంగనాథ్ క్షమాపణ ఎందుకు చెప్పినట్టు? ‘కోర్టు విధించే శిక్ష తప్పించుకునేందుకే క్షమాపణ చెప్పడంలో పశ్చాత్తాపం లేదు’ అనే తీవ్ర పదజాలాన్ని కోర్టు ఓ ఉన్నతాధికారి వాడారు.
రేవంత్‌రెడ్డి ఆజ్ఞనే నాకు చట్టం’ అన్నట్టు వ్యవహరిస్తున్న హైడ్రా కాంగ్రెస్‌కు భస్మాసురుడి హస్తమైంది. హైడ్రా తీరుతో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ రణరంగం ఏర్పడింది. దీనికి తోడుగా రంగనాథ్ అభిమాన సంఘాలు అన్నట్టుగా కొందరు ప్రాయోజిత ర్యాలీలు, మీటింగ్‌లు జరుపుతున్నారు. ఇలాంటి జిమ్మిక్కులు మానుకోకపోతే, ప్రతిపక్షాల మద్దతుతో హైడ్రా బాధితులు కూడా రోడ్ల మీదకు వస్తే ఎలా ఉంటుందో పాలకపక్షం ఆలోచించుకోవాలి.
కోర్టులు, రాజకీయ పార్టీలు, ప్రజలు హైడ్రా అవసరాన్ని కాదనడం లేదు. దానికి కమిషనర్‌గా ఉన్న రంగనాథ్ అతి దూకుడునే వ్యతిరేకిస్తున్నారు. ఆయన, ఆయన వెనుకున్న వాళ్ల ఇష్టారాజ్యానికి పేద, మధ్యతరగతి జీవుల కష్టార్జిత గూడులెన్నో నేలమట్టమయ్యాయి. గగ్గోలు పెడితే, ప్రజలు నిలదీస్తే ఆయన వెంటనే రూల్స్ మార్చేస్తారు.
ఇక నుంచి నివాసాలుగా ఉన్నవి కూల్చబోమని, ఖాళీగా ఉన్న వాటి పైనే యంత్రాలు దాడి చేస్తాయని, ఏదో కటాఫ్ తేదీ పెట్టి, ఆ తర్వాత కట్టిన వాటికే హైడ్రా వర్తిస్తుందని అంటున్నారు. ఇండ్లు కోల్పోయిన వారికి బిల్డర్ల నుంచి పరిహారం ఇప్పిస్తామని, నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. తమ పరిధిలో లేని విషయాలపై కూడా రంగనాథ్ మాట్లాడుతున్నారు. ఏ ఇంటర్వ్యూలో కూడా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పడంలేదు.
మరోవైపు హైకోర్టు వరుసగా హైడ్రా విధానాలకు ప్రశ్నిస్తూనే ఉన్నది. సెలవు రోజుల్లో సిబ్బందితో పని చేయించుకోవద్దు అని, రాత్రిపూట వెళ్లి ఇండ్లు కూల్చడం నేరం అని, కోర్టు జోక్యం చేసుకోకుండా శని, ఆదివారాల్లో వి ధ్వంసానికి పాల్పడొద్దు అని తేల్చిచెప్పింది. ఎందరికో స్టే ఆర్డర్లు అందజేసింది. ఇవేమీ హై డ్రాకు పగ్గాలు వేయలేకపోయాయి. ఆ దుందుడుకుతనమే విషయాన్ని ఇంత రాద్దాంతంగా మార్చింది. రంగనాథ్‌ను పక్కన పెట్టే ప్రసక్తే లేదని, ఏ ఉద్యోగిని ఎలా వినియోగించుకోవాలి అనే నిర్ణయాధికారం ప్రభుత్వానికి ఉం టుందని సీఎం చెప్తున్నారు. అవసరమైతే పైకోర్టుకు వెళ్తామని అంటున్నారు. తమ ఉత్తర్వుల ను ఉల్లంఘిస్తే హైడ్రా యంత్రాలు కదిలే చోటికి సైన్యాన్ని రప్పించి సిబ్బందిని అదుపులోకి తీసుకోవలసి వస్తుందని కూడా కోర్టు హెచ్చరించింది. కోర్టు చర్యల నుంచి రంగనాథ్‌ను పూర్తిగా కాపాడేందుకు సీఎం సిద్ధమయ్యారు.
కోర్టు ధిక్కరణ కేసులు వేసిన వారంతా భూకబ్జాదారులేనని అన్నారు. అలాంటప్పుడు కేసులు వేసిన వాళ్లు కబ్జాదారులు అని నిరూపించవచ్చు కదా! ప్రభుత్వ పాలన, ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ అధికారి అనే పరిధులు దాటి రంగనాథ్ నిజాన్ని ఒప్పుకోకుండా, కోర్టులనే తప్పుబడుతూ తన చర్యలు సమర్థించుకుంటున్నారు. సీఎంవోకు ఉన్నట్టే హైడ్రా పేరిట కూడా ఫేస్బుక్లో ఓ ఖాతా ఉన్నది. హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తూ, వారు భూకబ్జాదారులంటూ వారి పేర్లు, ఫొటోలతో భూమి వివరాలను ఆ ఖాతాలో పేర్కొన్నారు.
ఇది వారి వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించే విషయం. ఇందులో రంగనాథ్‌కు మద్దతుగా పెట్టిన పోస్టుల్లో జనం వ్యతిరేక కామెంట్లు చాలా ఉన్నాయి. పేదల ఇండ్లు కూల్చేటప్పుడు కనీసం సామాన్లు తీసుకోడానికి సమయం ఇవ్వలేదని, పిల్లల పుస్తకాలు కావాలని ఏడ్చినా అనుమతించని తీరును ప్రజలు గుర్తుచేస్తున్నారు. చెరువు భూముల్లో నిర్మించిన ఒవైసీల ఫాతిమా కాలేజీ, సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి రక్షణ కల్పించడమేంటని నిలదీస్తున్నారు.
కోర్టు ఆదేశాలను రేవంత్‌రెడ్డి, రంగనాథ్ వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకుంటున్నారు. హైడ్రా కు రంగనాథే కమిషనర్‌గా ఉండాలని పట్టుబడుతూ ప్రజాధనం ఖర్చు పెట్టి పైకోర్టుకు వెళ్లేంత అవసరమేమొచ్చింది? రంగనాథ్ లేకపోతే హైడ్రానే లేదా? ఆయన కోసమే హైడ్రా పుట్టిందా? కోర్టు ఆదేశాలు తప్పు, రంగనాథ్ రైటు అనుకుంటూ ఈ విషయాన్నీ పట్టుకొని సాగదీయడమేంటి? అంతటి అధికారి మరొకరు లేనేలేరా? కమిషనర్‌గా ఆయనే ఉండాలని కోరుకోవడంలో మరింకేదైనా కారణం ఉన్నదా?
-బద్రి నర్సన్