ఖమ్మం సిటీ, జనవరి 25: మరికొద్ది రోజుల్లో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకత్వం రెడీ అయింది. గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలకు పార్టీ తరఫున ఆదివారం ఇన్చార్జులను నియమించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఒక మున్సిపల్ కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీల్లో గులాబీ జెండాను ఎగుర వేయాలనే సంకల్పంతో ఈ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే, బీఆర్ఎస్ క్యాడర్‌ను ముందుండి నడిపించే విధంగా నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు.
దీనిలో భాగంగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌కు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఏదులాపురం (ఎస్సీ మహిళ) మున్సిపాలిటీకి ఎమ్మెల్సీ తాతా మధు, వైరా (ఎస్టీ) మున్సిపాలిటీకి మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మధిర (ఎస్సీ) మున్సిపాలిటీకి ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఇల్లెందుకు (ఎస్టీ) పార్టీ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, సత్తుపల్లి మున్సిపాలిటీకీ డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కల్లూరు మున్సిపాలిటీకి భద్రాద్రి జిల్లా గ్రంథాయల సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, అశ్వారావుపేట మున్సిపాలిటీకి ఉప్పల వెంకటరమణలను నియమించారు.