మధిర, అక్టోబర్ 04 : స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే సన్నద్ధం కావాలని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజు పిలుపునిచ్చారు. శనివారం మధిరలోని పార్టీ కార్యాలయంలో మధిర మండల నాయకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై వెంటనే కసరత్తు ప్రారంభించాలని సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన తీరును ప్రజలకు స్పష్టంగా వివరించాలన్నారు.
ప్రతి గ్రామంలోనూ నాయకత్వంతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, స్థానిక ఎన్నికల నిర్వహణపై సమగ్రంగా చర్చించుకోవాలన్నారు. విజయానికి అవసరమైన గ్రామస్థాయి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తరు నాగేశ్వరరావు, వంకాయలపాటి నాగేశ్వరరావు, చావా వేణు, బొగ్గుల భాస్కర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మధిర మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.