ఖమ్మం, ఆగస్టు 5: వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్పష్టం చేశారు. అందుకే బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తున్నదని ఆరోపించారు. ఘోష్ నివేదికను ప్రజలు నమ్మొద్దని పిలుపునిచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం (తెలంగాణ భవన్)లో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ) నిర్వహించారు. దీనిని అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులకు అనుసంధానం చేసి వాస్తవాలను వారికి వివరించారు.
ఇందులో భాగంగా ఖమ్మంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీష్‌రావు పీపీటీ సందేశాన్ని వినడానికి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వాస్తవ విషయాలను తెలుసుకోవడానికి భారీసంఖ్యలో ప్రజలు, పార్టీ నాయకులు హాజరయ్యారు. వారిని ఉద్దేశించి తాతా మధు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం కేసీఆర్‌ను అప్రతిష్టపాలు చేయడం, బీఆర్ఎస్ను దెబ్బతీయడం వంటి లక్ష్యాలతో లక్ష్యంతో బీజేపీతో కలిసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఆ కుట్రలో భాగమే ఘోష్ నివేదిక అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ చరిత్రను తూడ్చివేయలేరని స్పష్టం చేశారు. తొలుత జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోతు చంద్రావతి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, బెల్లం వేణు, కూరాకుల నాగభూషణం, ఖమర్, ఆర్జేసీ కృష్ణ, కర్నాటి కృష్ణ, మక్బుల్, వీరూనాయక్, పెంట్యాల పుల్లయ్య, బిచ్చాల తిరుమలరావు, రావూరి శ్రీనివాసరావు, కరమూరి వెంకటేశ్వరరావు, బాషబోయిన వీరన్న, మాటేటి కిరణ్, బాణాల వెంకటేశ్వర్లు, కనకాల వెంకట్రావు, వీరమోహన్‌రెడ్డి, యాగంటి శ్రీనివాసరావు, డోకుపర్తి సుబ్బారావు, ఉప్పల వెంకటరమణ, సింహాద్రి యాదవ్, గిరిబాబు, మంజులనాయక్, తాజుద్దీన్, వెంకటఅప్పారావు, జ్యోతిరెడ్డి, రఫీ, అసిఫ్పాషా, సద్దాం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.