జూలూరుపాడు, మే 14: నియోజకవర్గంలో ప్రజలు సమస్యలు తెలుసుకొని తక్షణం పరిష్కరించేందుకు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించేందుకే ‘గడపగడపకూ రాములన్న’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వైరా ఎమ్మెల్యే రామలునాయక్ తెలిపారు. ప్రజల నిండు దీవెనలతో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలను కలుసుకోవడం, వారి యోగక్షేమాలు తెలుసుకోవడం, పథకాలు అందుతున్న తీరు గురించి ఆరా తీయడం కోసమే ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించే దిశగా అన్ని శాఖల అధికారులతో కలిసి గడపగడపకూ వెళ్తానని అన్నారు. ‘గడపగడపకూ రాములన్న’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో ఆదివారం పాదయాత్రను ప్రారంభించారు. తొలుత కొమ్ముగూడెంలోని పెద్దమ్మతల్లి దేవాలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ‘అవ్వా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పాలన అందిస్తోంది? పథకాలు మీ ఇంట్లో ఎంతమందికి అందుతున్నాయి? రైతుబంధు అందుతోందా? దానిని పంటల పెట్టుబడికి ఎలా వినియోగిస్తున్నారు? ఆసరా పింఛన్ ఎకౌంట్లో జమ అవుతోందా? మీ మనమరాలి వివాహానికి సీఎం కేసీఆర్ పంపిన రూ.లక్ష కల్యాణలక్ష్మి చెక్కు అందిందా?’ అంటూ అడిగి తెలుసుకుంటూ ముందుకు కదిలారు. కొమ్ముగూడెం, కరివారిగూడెం, తవిశిగుట్టతండాల్లో కాలినడకన విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగానే.. వెంటనే అధికారులను పిలిపించి వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని దేశమంతా కీర్తిస్తోందని అన్నారు. ఇక్కడి పథకాలను ప్రధాని మోదీ కూడా కాపీ కొడుతున్నారని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమవుతుందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు లాకావత్ గిరిబాబు, యల్లంకి సత్యనారాయణ, పసుపులేటి మోహన్‌రావు, వేల్పుల నర్సింహారావు, పొన్నెకంటి సతీశ్‌కుమార్, లావుడ్యా సోని, భూక్యా కళావతి, యదళ్లపల్లి వీరభద్రం, శాంతిరాం, శాంతిలాల్, నున్నా రంగారావు, చౌడం నర్సింహారావు, మోదుగు రామకృష్ణ, చేపలమడుగు రామ్మూర్తి, రామిశెట్టి నాగేశ్వరరావు, మిర్యాల కిరణ్‌కుమార్, లాలూనాయక్, మైబు, వెంకటేశ్వర్లు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.