వరంగల్ సభకు తరలిన ప్రజావాహినిని చూసి కాంగ్రెస్ సర్కారుకు దడపుడుతోందని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. అలవిగానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కేవలం 16 నెలల్లోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పాలనే హస్తం పార్టీకి ఉరితాడు అవుతుందని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజల దీవెనలతో 2028లో కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూస్తామని స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ నిర్వహించే రజతోత్సవ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గులాబీ సేనలతోపాటు సబ్బండ వర్గాల ప్రజలు వేలాదిగా తరలివెళ్లారు. కాగా, పాతికేళ్ల పండుగ సందర్భంగా అన్ని గ్రామాల్లోనూ పార్టీ నేతలు బీఆర్ఎస్ దిమ్మెలపై గులాబీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం వందలాది వాహనాల్లో సభకు బయలుదేరి వెళ్లారు.
-నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 27
సభకు బయలుదేరేముందు తిరుమలాయపాలెంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, ఖమ్మం నగరంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం రూరల్‌లో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మణుగూరులో పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, దమ్మపేటలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మధిరలో ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, భద్రాచలంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు మానె రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్ తదితరులు బీఆర్ఎస్ దిమ్మెలపై గులాబీ జెండాలను ఎగురవేశారు.
అంతకుముందు భారీగా బైక్ ర్యాలీలు నిర్వహించారు. కనుచూపు మేరలో కల్పించేలా బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో గులాబీ శ్రేణులు తరలివెళ్లాయి. మణుగూరులో రేగా కాంతారావు, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావులు గులాబీ శ్రేణులతో కలిసి నృత్యాలు చేసి వారిని ఉత్సాహ పరిచారు. వనమా సతీమణి పద్మావతి బొట్టుపెట్టి మరీ వనమాను వరంగల్‌కు సభకు పంపారు.
బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా తెలంగాణ గులాబీమయమవడాన్ని చూసి కాంగ్రెస్ ప్రభుత్వం హడలెత్తిపోతోందని పార్టీ నేతలు విమర్శించారు. ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న జనసంద్రాన్ని చూసి రేవంత్ సర్కారుకు దడపుడుతోందని ఎద్దేవాచేశారు. కేసీఆర్‌ను కళ్లారా చూసేందుకు, ఉపన్యాసాన్ని చెవులారా వినేందుకు తెలంగాణ ప్రజలందరూ వరంగల్‌కు తరలుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభకు వెళ్లే వాహనాలను అడ్డుకునేందు కుట్రలు పన్నుతున్న వాళ్లు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ సభకు వాహనాలను సమకూర్చిన వారిని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి భయభ్రాంతులకు గురి చేయడం దారుణమని అన్నారు.
మంత్రులు హైదరాబాద్‌లో కూర్చొని ఖమ్మం నుంచి బహిరంగ సభకు బయలుదేరిన ప్రజలను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. కానీ వారి కుట్రలన్నీ విఫలమయ్యాయని, జిల్లా ప్రజలందరూ వరంగల్ సభకు చేరుకున్నారని స్పష్టం చేశారు. సబ్బండ వర్గాలకు గులాబీ జెండాను అండగా నిలుస్తుందని అభయమిచ్చారు. యావత్ తెలంగాణ సమాజం కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తోందని అన్నారు. రాబోయే రోజులు బీఆర్ఎస్వేనని స్పష్టం చేశారు.
ఎల్కతుర్తి సభ అద్భుతంగా విజయవంతమైందని అన్నారు. గులాబీ పార్టీ విజృంభణకు ఇది ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ సభను చూసి కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం కలుగుతోందని అన్నారు. భవిష్యత్తులో ప్రజలే బుద్ధిచెప్పడం ఖాయమని, గద్దె దింపడం ఖాయమని స్పష్టం చేశారు.