కూసుమంచి, అక్టోబర్ 29: బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి ప్రచార రథం కదిలింది. అధికారికంగా తొలిరోజు ప్రచారానికి ఆదివారం ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత ఖమ్మం రూరల్ మండలంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సతీమణి విజయమ్మ ఆయనకు తిలకందిద్ది పంపారు. అక్కడి నుంచి బయలుదేరి రెడ్డిపల్లిలోని మారెమ్మతల్లిని దర్శించుకున్న కందాళ.. సొంత గ్రామమైన కూసుమంచి మండలం రాజుపేటలోని ఆలయంలోనూ పూజలు చేశారు. ఇదే గ్రామంలోని తన తల్లిదండ్రులు, తమ్ముడి సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడి నుంచి నేరుగా మునిగేపల్లి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గతంలోనూ ఇదే గ్రామం నుంచి ప్రచారం ప్రారంభించగా.. ఈసారి కూడా అదే ఆనవాయితీని కొనసాగించారు. రాజుపేట, మునిగేపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయన ఘన స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులు తోడు రాగా.. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు కలిసి వచ్చి మొదటిరోజు ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ టికెట్ ఖరారైన రోజు నుంచి వివిధ గ్రామాల్లో పర్యటించినప్పటికీ అధికారిక ప్రచారం మాత్రం ఆదివారం నుంచే మొదలుపెట్టారు.
గత ఎన్నికల సమయంలో కేవలం 17 రోజుల ముందు ప్రచారాన్ని ప్రారంభించిన కందాళ.. ఈ సారి 31 రోజుల ముందే శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల సమయంలో పోలింగ్ ముందు ఎన్నికల కోడ్, నామినేషన్ రోజు, పండుగ రోజు పోను కేవలం 14 రోజులు మాత్రమే ప్రచారం చేశారు. సమయం లేకపోవడంతో 150 గ్రామాలకు గాను 110 గ్రామాల్లో మాత్రమే ప్రచారం చేశారు. ఈ సారి మాత్రం అన్ని గ్రామాల్లోనూ తిరిగేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే కందాళను గెలిపిస్తే నియోజకవర్గమంతటికీ దళితబంధును ప్రకటిస్తామన్న సీఎం కేసీఆర్ హామీని బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఎమ్మెల్యే కందాళ.. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతోపాటు తన సొంత సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. మొదటి రోజు మునిగేపల్లి, అగ్రహారం, లోక్యాతండా, కోక్యాతండా, గట్టుసింగారం గ్రామాల్లో ప్రచారం సాగించారు. మ్యానిఫెస్టోలోని ప్రతి ఇంటికీ రూ.5 లక్షల బీమా, ప్రతి కుంటుంబానికీ సన్న బియ్యం పంపిణీ, రైతుబంధు పెంపు, ఆసరా పింఛన్ల పెంపు, రూ.15 లక్షలకు ఆరోగ్యశ్రీ బీమా పెంపు, రూ.400కే వంట గ్యాస్, పేదలకు ఇండ్ల స్థలాలు వంటి హామీలను వివరించారు. ఎమ్మెల్యే సతీమణి విజయమ్మ, కుమార్తె దీప్తి, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఎస్.ఉపేందర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, మరికంటి ధనలక్ష్మి, రామసహాయం బాలకృష్ణారెడ్డి, ఇంటూరి బేబి, ఇంటూరి శేఖర్, బాణోత్ శ్రీనివాస్, బెల్లం వేణు, వేముల వీరయ్య, ఉన్నం బ్రహ్మయ్య, పాషబోయిన వీరన్న, యండపల్లి వరప్రసాద్, నంబూరి శాంత, బోడా మంగీలాల్, వజ్జా రమ్య, కందాళ క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.