ఖమ్మం, జనవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలుకోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో గత కొన్నిరోజులుగా జరుగుతున్న పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశాల్లో భాగంగా మంగళవారం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీమంత్రి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల తరఫున పోరాడేందుకు పార్టీ శ్రేణులు కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేలా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషిచేయాలని అన్నారు. ఒకటీరెండు జిల్లాల్లో తప్ప అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరసరించలేదనడానికి మనం సాధించిన ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతోపాటు 11 స్థానాలు అత్యల్ప మెజార్టీతో చేజారిపోయాయని గుర్తుచేశారు. ఇంకా కొన్నిచోట్ల పలు కారణాలతో సీట్లు కోల్పోయామన్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని సమీక్షించుకొని ముందుకు సాగుదామని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నెలదాటిందని, వచ్చిన తెల్లారినించే వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు హామీల అమలులో కాలయపన చేస్తున్నారన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసహనం ప్రారంభమైందన్నారు. ఇదిఇలాగే కొనసాగే పరిస్థితి ఉన్నదని, ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతమని, గత చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యేది కూడా అదేనన్నారు. 1983లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన అనంతరం రాజకీయ పరిణామాలను గమనిస్తే ఈ విషయం అర్థమౌతుందన్నారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీని తిరసరించి కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలు కేవలం ఏడాదిన్నర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసాన్ని కోల్పోయారని గుర్తుచేశారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ అనంతరం జరిగిన నాటి లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యిందని, ఆ ఎన్నికల్లో అదే ప్రజలు టీడీపీని తిరిగి భారీ మెజార్టీతో గెలిపించిన సంగతి మనం మరువకూడదన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ, చిత్తశుద్ధి కాంగ్రెస్‌కి ఉండదనేది గత నెలరోజుల ఎన్నికల అనంతర పరిణామాలను పరిశీలిస్తే మరోసారి రుజువైందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు రాజకీయ అస్తిత్వంగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను గెలిపించిందన్నారు. పదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలబెట్టిందని, తెలంగాణ గళం, బలమూ బీఆర్ఎస్సే అన్నారు.
రాబోయే ప్రతి అడుగులో కేసీఆర్ దళంగా ఐకమత్యంగా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పటికన్నా ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకొస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోవాలని, కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే డేంజర్ అని పేర్కొన్నారు. సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ఫుల్ అన్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయని తెలిపారు. త్వరలోనే రాష్ట్ర, జిల్లా నూతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి రెండు మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తామని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం సీటును కచ్చితంగా గెలవాల్సిందేనన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఆర్జేసీ కృష్ణ, జిల్లాకు చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.