ఖమ్మం, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని, రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్ కేటాయించకుండా ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కారని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ పార్లమెంటరీ నేత వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభలో ధ్వజమెత్తారు.
మంగళవారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన జాతీయ బడ్జెట్‌పై చర్చలో పాల్గొంటూ రాష్ట్ర ప్రజల న్యాయమైన హకులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి మరోసారి తెచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో గొప్పగా అభివృద్ధి చేశారన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం సరైంది కాదన్నారు.
తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్ల పట్ల స్పందించి నిధులు కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. పాలమూరు -రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలన్నారు. ఐఐఎం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ) నెలకొల్పాలన్నారు. కొత్తగా ఏర్పడిన 23 జిల్లాలకు నవోదయ పాఠశాలలు మంజూరు చేయాలని, ఐటీఐఆర్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపి యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్, కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉకు కర్మాగారాన్ని నెలకొల్పి రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.