ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 25 : ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర పెరుగుదలపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, బీఆర్ఎస్ నాయకుల పర్యటన ప్రభావం స్పష్టంగా కనపడింది. ఈ నెల 22వ తేదీన శుక్రవారం మాజీ మంత్రి టీ హరీశ్‌రావు మాజీ మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బీ చంద్రావతితోపాటు ఇతర రాష్ట్ర నాయకులతో కలిసి ఖమ్మం మార్కెట్ పరిధిలోని పత్తియార్డును సందర్శించిన సంగతి తెలిసిందే.
ఈ పర్యటనలో భాగంగా మార్కెట్ కమిటీ అధికారుల నుంచి గత కొద్దిరోజులుగా రైతులకు అందుతున్న ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సగటున క్వింటాల్‌కు ఒక్కంటికి రూ.6,500 మాత్రమే పలుకుతుందని, తద్వార పత్తి రైతులు క్వింటాల్‌కు ఒక్కంటికి రూ.1000-1500 వరకు నష్టపోతున్నారని మండిపడ్డారు. రైతులకు జరుగుతున్న నష్టాన్ని అసెంబ్లీ సమయంలో ప్రశ్నిస్తానని రైతులకు భరోసా కల్పించారు.
అయితే వరుసగా రెండురోజుల సెలవుల అనంతరం సోమవారం మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. ఎవ్వరూ ఊహించని విధంగా ఉదయం జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో క్వింటాల్ పత్తి రూ.7,025 పలికింది. మెజార్టీ మంది రైతులకు క్వింటాల్ రూ.6,800 నుంచి రూ.7 వేల వరకు పలకడం విశేషం. అయితే పెరిగిన ధరలు మరికొన్ని రోజులపాటు ఉంటాయా.. ఒకటీ రెండురోజులకే పరిమితమవుతాయా వేచిచూడాలి.