ఖమ్మం, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గురువారం ఖమ్మానికి రానున్నారు. గురు, శుక్రవారాల్లో ఖమ్మం నగరంతోపాటు చింతకాని మండలాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సహా ఇతర నేతలు ఇప్పటికే సన్నాహక పనులను పూర్తి చేశారు.
ఫార్మా కంపెనీల కోసం లగచర్ల ప్రాంతంలో గిరిజన రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటున్న రేవంత్ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఇప్పటికే పోరుబాట పట్టింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే దేశవ్యాప్త ఉద్యమం చేస్తున్నారు. బీఆర్ఎస్ అగ్ర నాయకులు మొత్తం ప్రజాక్షేత్రంలో ఉండి రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో లగచర్ల రైతులకు మద్దతుగా ఖమ్మంలో నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొంటున్నారు. ఆ తరువాత పత్తి, మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించాలనే డిమాండ్‌తో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శిస్తారు. ఈ తరువాత చింతకాని మండలంలో రైతులను పరామర్శిస్తారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు పిలుపునిచ్చారు.