మధిర, జూలై 7 : రైతు ప్రభాకర్ కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపించింది. కొండంత ఆశతో ఎదురుచూస్తున్న ఆ కుటుంబ సభ్యులకు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కనీసం ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించకుండానే వెనుదిరిగారు. వివరాల్లోకెళ్తే.. ఖమ్మంజిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజడ్ల ప్రభాకర్ ఈ నెల 1వ తేదీన ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. వారంరోజులుగా పలు పార్టీల నేతలు, సంఘాల నాయకులు ఆ రైతు కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.. కానీ మధిర ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం అయిన భట్టి విక్రమార్క మాత్రం వారంరోజుల తర్వాత ఆదివారం ప్రొద్దుటూరు గ్రామానికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ముందుగా కలెక్టర్ ముజమిల్‌ఖాన్ రైతు కుటుంబాన్ని పరామర్శించి వారి నుంచి వివరాలు సేకరించారు. కాసేపటికి భట్టి విక్రమార్క వచ్చి ప్రభాకర్ తండ్రి పెద్ద వీరయ్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ తండ్రి మాట్లాడుతూ తమ భూమికి సంబంధించిన హద్దులు, హక్కులు, దారి ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూమికి హద్దులను ఏర్పాటు చేస్తామని, దారి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎంను చూడగానే పెద్దవీరయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభాకర్ పిల్లలు చిన్నవారని, తాను వృద్ధాప్యంలో ఉన్నానని ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ప్రాధేయపడ్డాడు. కానీ భట్టి మాత్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించలేదు.. ప్రభాకర్ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చదివియ్యాలని కలెక్టర్‌ను ఆదేశించారు. డిప్యూటీ సీఎం పర్యటనకు వైరా సబ్ డివిజన్ ఏసీపీ రెహమాన్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
రైతు ప్రభాకర్ మృతికి కారణమైన వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నాసరే ఉపేక్షించేదిలేదని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పరామర్శ అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రైతు మరణం చాలా బాధాకరమని, ఆత్మహత్యలే సమస్యలకు పరిష్కారం కావని అన్నారు. ప్రభాకర్ ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలు, దారితీసిన పరిస్థితులను సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పోలీస్‌శాఖను ఆదేశించారు. అందరూ మా వాళ్లే.. నా వాళ్లే అని చెప్పి దోషులను వదిలిపెట్టేదిలేదని అన్నారు.
ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించిన తక్షణమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అదే ప్రభాకర్ మృతి విషయంలో నిందితుడిగా ఉన్న కూరపాటి కిషోర్ ఇంటికి వెళ్లి అక్కడ ఆ పార్టీ నాయకులతో కొద్దిసేపు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. భట్టి తన ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న కిషోర్ పోలీసుల మధ్యనుంచే స్వేచ్ఛగా నడుచుకుంటూ భట్టి దగ్గరకు వెళ్లడం గమనార్హం. అనంతరం కిషోర్ ఇంటి నుంచి భట్టి వెళ్లిపోయాడు. అయితే అక్కడే బందోబస్తు నిర్వహిస్తున్న ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది ఉన్నప్పటికీ నిందితుడైన కిషోర్‌ను మాత్రం అరెస్టు చేయకపోవడం ఏమిటని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మా భవిష్యత్తుకు న్యాయం చేయండంటూ ప్రభాకర్ కుమారుడు, కుమార్తె తమ ఇంటి ముందు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తన తండ్రి ప్రభాకర్ మందు డబ్బా పట్టుకొని ఏడుస్తూ ఉన్న ఫొటోతోపాటు పిల్లలిద్దరూ దండం పెడుతూ ఆలోచింపజేసేలా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.