నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 16 : ‘ఫార్ములాఈ కార్ రేస్’ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులో రెండోసారి సోమవారం ఏసీబీ విచారణకు హాజరవుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పార్టీ శ్రేణులన్నీ అండగా నిలిచాయి. నైతిక ైస్థెర్యాన్ని అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలిరాగా.. ఉమ్మం ఖమ్మం జిల్లా నుంచి కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వందల సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన నివాసంలోనూ, పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌లోనూ కేటీఆర్‌ను కలిసి సంపూర్ణ మద్దతు తెలిపారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన తమ నేతపై రేవంత్ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తూ కక్షసాధిస్తుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టి తమ నేత కేటీఆర్‌ను విచారించడమంటే ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతును నొక్కివేయడమేనని అన్నారు. తమ నేతపై ఎంతటి నిందలు మోపినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెరవబోమని తేల్చిచెప్పారు. తమ నేతకు సంపూర్ణ సంఘీభావం ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల మద్దతుతో ఎదిగిన నాయకులను ఇలాంటి తప్పుడు కేసులు ఏమీ చేయలేవని తేల్చిచెప్పారు.
ఏసీబీ విచారణకు హాజరవుతున్న కేటీఆర్‌కు సంపూర్ణ మద్దతును తెలియజేసేందుకు; ఆయనకు అండగా నిలిచేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు వందల సంఖ్యలో సోమవారం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ కేటీఆర్‌ను కలిసిన వారిలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, బానోతు హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, ఖమ్మం జడ్పీ, డీసీసీబీ, భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థల మాజీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కూరాకుల నాగభూషణం, దిండిగాల రాజేందర్, కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఇతర నేతలు బొమ్మెర రామ్మూరి, పగడాల నాగరాజు, బచ్చు విజయ్‌కుమార్, వలరాజు, జ్యోతిరెడ్డి తదితరులు ఉన్నారు.
కేటీఆర్‌కు మద్దతు తెలిపేందుకు రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌కు తరలివెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర బంజారాహిల్స్‌లోని తన నివాసంలో భోజనం ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌కు, ఏసీబీ డైరెక్టరేట్‌కు దగ్గరలోనే వద్దిరాజు ఇల్లు ఉండడంతో శ్రేణులందరినీ తన ఇంటికి ఆహ్వానించి భోజనం సిద్ధం చేశారు.