అశ్వాపురం, జూలై 10 : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతోనే ‘సీతారామ’ ద్వారా ఉమ్మడి జిల్లా రైతుల పంట భూములకు సాగునీరు అందుతున్నదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఉమ్మడి జిల్లా వరప్రదాయినిగా, కేసీఆర్ మానస పుత్రికగా పేరుగాంచిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అధికారులు బీజీ కొత్తూరు పంపుహౌస్ నుంచి గోదావరి జలాలను విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన..
పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను ముందుగానే అంచనా వేసిన కేసీఆర్.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోనే పరిష్కారం లభిస్తుందని గుర్తించి, వాటి నిర్మాణానికి పూనుకున్నారని గుర్తు చేశారు. ఎలాంటి కరవు వచ్చినా సీతారామ కెనాల్ ద్వారా ఉమ్మడి జిల్లాతోపాటు మహబూబాబాద్, నల్లగొండ జిల్లాలకు సాగునీరు అందించవచ్చని పేర్కొన్నారు.