ఖమ్మం, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినా ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగే ఎల్కతుర్తికి ఆదివారం గులాబీ దండు కదిలింది. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా, ఎక్కిన బస్సును దింపివేయడానికి ప్రయత్నించినా గులాబీ సైన్యం తమ పార్టీ నేతల అండదండలంతో ముందుకు సాగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి అంచనాలకు మించి పెద్దఎత్తున పార్టీ శ్రేణులు ఉదయమే తమ తమ ప్రాంతాల నుంచి బస్సులు, కార్లు, ఇతర వాహనాల ద్వారా ఎల్కతుర్తి సభకు బయలుదేరాయి.
సత్తుపల్లి ప్రాంతం నుంచి బయలుదేరిన ప్రైవేటు బస్సులను కల్లూరు వద్ద రవాణాశాఖ అధికారులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రైవేటు బస్సులకు అనుమతిలేదంటూ రవాణా శాఖ అధికారులు పార్టీ శ్రేణులకు చెప్పడంతో ముందస్తుగా అనుమతులు తీసుకున్నాక ఇప్పుడు ఆపడమేంటంటూ పార్టీ నేతలు కల్లూరు ప్రధాన రహదారిపై బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు.. జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు. సభకు వెళ్లే వారిని అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. దీంతో వాహనాలను అధికారులు పంపించారు.
ఇక ఖమ్మం జిల్లా నుంచి వెళ్తున్న అనేక వాహనాలను తిరుమలాయపాలెం వద్ద ఆర్టీఏ అధికారులు మరోసారి తనిఖీ పేరిట నిలిపివేశారు. విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులు తిరుమలాయపాలెం చేరుకొని ఆర్టీఏ అధికారులను ప్రశ్నించారు. కారణం తెలుపకుండా బస్సులు ఎలా ఆపుతారని, సామరస్య ధోరణితో వ్యవహరించాల్సిన అధికారులు తనిఖీల పేరుతో ఇబ్బందిపెట్టడమేంటని నిలదీశారు. అక్కడ నిలిపిన బస్సులను తాతా మధు, సండ్ర, కందాళ స్వయంగా దగ్గరుండి సభకు పంపించారు.
తరువాత మళ్లీ అక్కడే బస్సులను ఆపుతున్నారన్న సమాచారం తెలుసుకుని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పార్టీ శ్రేణులతో కలిసి తిరుమలాయపాలెం చేరుకున్నారు. బస్సులను ఆపి పార్టీ కార్యకర్తలను ఇబ్బందిపెడితే తాను ఇక్కడే ఉండి ధర్నా చేస్తానని స్పష్టం చేశారు. అన్ని బస్సులు వెళ్లేంతవరకు కదలబోనని భీష్మించారు. ఆర్టీఏ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు.
బస్సులు నిలిపివేయాలన్న ఆదేశాలేమీ లేవని, బస్సులు పంపించాలని అక్కడున్న అధికారులకు చెబుతామని వారు సమాధానమిచ్చారు. ఖమ్మం జిల్లా నుంచి బస్సులు వెళ్లేంత వరకు పువ్వాడ అజయ్ తిరుమలాయపాలెం పోలీసుస్టేషన్ సమీపంలో కూర్చుని ఎల్కతుర్తికి బస్సులు సజావుగా వెళ్లేలా పర్యవేక్షించారు. ఆర్టీసీ బస్సులతోపాటు కార్యకర్తలు, పార్టీ నాయకులు ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేసుకుని పెద్దఎత్తున సభకు తరలివెళ్లారు. ప్రతి గ్రామం నుంచి సభకు వెల్లువలా కార్యకర్తలు తరలివెళ్లారు.
అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, ఇల్లెందు, వైరా, సత్తుపల్లి, మధిర, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు వెల్లువలా తరలివెళ్లారు. వేలాదిమంది సొంతంగా వాహనాలు సమకూర్చుకుని మరీ బయలుదేరారు. పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు పయనమై వెళ్లారు. వాహనాల్లో వెళ్లేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా నియోజకవర్గాల ఇన్చార్జులు, నేతలు ప్రతి బస్సుకు ఇద్దరు ఇన్చార్జులను నియమించి ఏర్పాట్లు చేశారు. మంచినీరు, మజ్జిగ వంటి ప్యాకెట్లను బస్సుల్లో సిద్ధంగా ఉంచారు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, మదన్‌లాల్, హరిప్రియనాయక్, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, భద్రాచలం నియోజకవర్గ నాయకులు మానె రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్‌ల ఆధ్వర్యంలో కార్యకర్తలు కార్యకర్తలు వేలాది వాహనాల్లో తరలివెళ్లారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు లక్ష మంది వరకు కార్యకర్తలు వెళ్లినట్లు పార్టీ వర్గాల సమాచారం.