భద్రాచలం, జూలై 15 : భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్థానిక బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆధ్వర్యంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ‘రణభేరీ నిరసన దీక్ష’ నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాచలం నియోజకవర్గ సీనియర్ నాయకుడు రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత ఉందని, రోగులకు సరైన వైద్యసేవలు అందడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల ఆసుపత్రి పరిస్థితులపై పలు నివేదికలు వెలువడిన నేపథ్యంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంత ప్రజలకు వైద్యసేవలు అందించే కీలక ఆసుపత్రిగా ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి, అవసరమైన సిబ్బంది, ఆధునిక వైద్య పరికరాలు, మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. భద్రాచలం ఎమ్మెల్యే ఆసుపత్రి ప్రగతికి కనీస చర్యలు తీసుకున్న పాపానపోలేదని విమర్శించారు. పార్టీ సీనియర్ నాయకుడు మానే రామకృష్ణ మాట్లాడుతూ భద్రాచలం ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో సమస్యలను పరిషరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
నిరసన దీక్షకు తెలంగాణ ఉద్యమ నాయకుడు తిప్పన సిద్ధులు, ఆదివాసీ నాయకులు గుండు శరత్‌బాబు, పూనెం వీరభద్రం, పాయం రవివర్మ, ప్రముఖ వ్యాపారవేత్త యశోద నగేష్, మాల మహానాడు నాయకుడు దాసరి శేఖర్ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆకోజు సునీల్‌కుమార్, కావూరి గోపి, రేపాక పూర్ణచంద్రరావు, కోటగిరి ప్రమోద్‌కుమార్, గోసుల శ్రీనివాస్, ఉడత రమేష్, తుమ్మలపల్లి ధనేశ్వరరావు, కొల్లం జయ ప్రేమ్‌కుమార్, రావూరి రవికిరణ్, కాపుల సూరిబాబు, కొండముకల సాయిబాబా, మురాల ప్రదీప్, అనిల్, రామకృష్ణ, అప్పారావు, రుద్రరామరాజు, మహిళా నాయకులు కావూరి సీతామహాలక్ష్మి, ఎండీ ముంతాజ్, మాజీ ఎంపీపీ ఊకె శాంతమ్మ, రాధాసలోమి, కామేశ్వరి, రహీమా, మదారి, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.